సాక్షి, బళ్లారి :
నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో పాల ధరను స్వల్పంగా పెంచుతున్నట్లు కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి లీటరు పాలపై రూ. 2 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా నగరంలోని రాయచూరు, బళ్లారి, కొప్పల జిల్లాల సహకార పాల సమాఖ్య కేంద్రంలో వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాడి రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు ప్రభుత్వం తొలుత రూ.2 ఇచ్చిందని, తర్వాత మరో రూ.2 ఇవ్వడంతో లీటరు రూ.4 ఇస్తున్నట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా పాలసేకరణ ఖర్చులు, వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన పాలను పంపిణీ చేయడానికి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో లీటరుకు మరో రూ.2 పెంచడం అనివార్యమవుతోందన్నారు.
ఇటీవల బెంగళూరులో నిర్వహించిన పాల సమాఖ్య మహామండలి సభ్యుల సమావేశంలో పాల ధర పెంపునకు తీర్మానించి ప్రభుత్వానికి నివేదిక పంపామని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం కూడా పాల ధర పెంపునకు అంగీకారం తెలిపిందన్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోలి స్తే కర్ణాటకలో లీటర్ పాల ధ ర తక్కువగా ఉన్నట్లు వివరించారు. రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేఎంఎఫ్ చూసుకుంటుందన్నారు. నందిని శుభం పాల ధర ఇకపై లీటరుకు రూ.36 ఉంటుందన్నారు. నందిని శుభం గోల్డ్ పాల ధర లీటరు రూ.37, నందిని శుభం గోల్డ్ పాల ధర అర లీటరు రూ.19, నందిని టోన్డ్ పాల ధర లీటరు రూ.30 ఉంటుందని వివరించారు. వినియోగదారులపై అధిక భారం పడకుండా కేవలం రూ.2ను మాత్రమే లీటర్‌పై పెంచామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మోత్కూ రు శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన పాల ధర
Published Wed, Sep 11 2013 4:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement