'డబుల్' ఇళ‍్లకి డబ్బులడిగితే నిలదీయండి: కేటీఆర్
Published Tue, Apr 4 2017 1:27 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
మహబూబ్‌నగర్ : డబుల్ బెడ్‌రూం ఇళ‍్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయండని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ‍్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇళ్ల మంజూరు విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన వారికి కచ్చితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఉద్ఘాటించారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక.. డబుల్ బెడ్‌రూం ఇళ్లు అని మంత్రి పేర్కొన్నారు.
శంలో అన్ని రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువ ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ఇరుకైన పడక గదితో ఇంటిని నిర్మించి పైన మూడు రంగులు వేయించిందని చురకలంటించారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని కొనియాడారు. సామాజిక సమీకరణాలు పట్టించుకోకుండా పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు కల్యాణలక్ష్మీ పథకం కింద రూ. 75,000 అందజేస్తున్నారని తెలిపారు. ఈ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement