ముంబై: గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ విమర్శించింది. మంత్రులను మార్చినంతమాత్రాన ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ముంబై విభాగం అధ్యక్షుడు ఆశిష్ శేలార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిందో ప్రజలకు తెలుసని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగా వైద్యవిద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జితేంద్ర అవ్హాడ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ, శివసేనలు ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు శేలార్ సమాధానమిస్తూ... ప్రతిపక్షాల తరఫున తాను హాజరయ్యానని చెప్పారు.
తమ పార్టీ నేతలు పర్యటనల్లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, అయితే అంతా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు, ఎన్సీపీకి నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం వరించింది. మిగతా నలభై స్థానాల్లో ఆ పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. మళ్లీ అదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని ప్రతిపక్ష బీజేపీ, శివసేనలు చెబుతున్నాయి.
ఒరిగేదేమీ లేదు: బీజేపీ
Published Thu, May 29 2014 10:50 PM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM
Advertisement