భావి నేత అన్నయ్యే
పార్టీ భవిష్యత్తు
‘స్టాలిన్’ చేతుల్లోనే
వ్యతిరేకతకు నో చాన్స్
కనిమొళి స్పష్టీకరణ
సాక్షి, చెన్నై : అధినేత కరుణానిధి తదుపరి డీఎంకేకు భవిష్యత్తు నేత ఎంకే స్టాలిన్ అని ఆ పార్టీ ఎంపీ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి స్పష్టం చేశారు. పార్టీ భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారన్నారు. డీఎంకేలో సాగుతున్న కుటుంబ వారసత్వ పదవుల కుమ్ములాట ప్రచారాలకు కళ్లెం వేస్తూ కనిమొళి ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
డీఎంకేలో కరుణానిధి అధ్యక్ష పదవిని తన్నుకెళ్లడం లక్ష్యంగా ఆయన వారసులు, అన్నదమ్ముళ్లు ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వార్ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్‌తో అళగిరి ఏకంగా పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దన్నయ్య అళగిరి రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటుగా, సోదరి కనిమొళితో పలు మార్లు భేటీలు కావడం చర్చలకు దారి తీసింది. అదే సమయంలో పార్టీలో తనకంటూ మద్దతు వర్గాన్ని కూడగట్టుకునే పనిలో కనిమొళి ఉరకలు పరుగులు తీయడం చర్చలకు మరింత బలాన్ని చేకూర్చాయి. చిన్న అన్నయ్య స్టాలిన్‌తో కనిమొళి విభేదించి ముందుకు సాగుతున్నట్టుగా ప్రచారం సైతం ఊపందుకుంది. ఇక, కనిమొళిని అందలం ఎక్కించే విధంగా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పదవి, పార్టీ రాజ్యసభ నేత పదవిని కరుణానిధి కట్టబెట్టడం స్టాలిన్ వర్గంలో కాస్త కలవరాన్నే సృష్టించాయి. కనిమొళికి కరుణానిధి ప్రాధాన్యతను పెంచుతున్నారన్న చర్చ డీఎంకేలో బయలు దేరింది.
ఈ పరిస్థితుల్లో ఎవర్ని ప్రచారాలు చేసినా, ఎన్ని కథనాలు రాసినా వాటితో తనకు అనవసరం అని, తన చిన్న అన్నయ్యే డీఎంకే భావి నేత అంటూ కనిమొళి కుండ బద్దలు కొట్టి తాజాగా వ్యాఖ్యానించడంతో పైన పేర్కొన్నట్టుగా కథనాలు, ప్రచారాలకు కల్లెం వేసినట్టు అయింది. డీఎంకే రాజ్య సభ నేత, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న అన్నయ్య డిఎంకే భావినేత అని స్పష్టం చేశారు. డిఎంలో వారసత్వం సమరం మీడియా సృష్టేనని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని, తామంతా డిఎంకే గొడుగు నీడ ఉన్న సేవకులం అని స్పష్టం చేశారు.
డిఎంకే భవిష్యత్తు స్టాలిన్ చేతిలో ఉందని, ఆయన సారథ్యంలో భవిష్యత్తులో అందరూ కలసి కట్టుగా పనిచేస్తారన్నారు. ఆయనకు వ్యతిరేకులు పార్టీలో ఎవరూ లేరు అని ఆయన భావి నేత అన్నది అందరూ కలసి నిర్ణయం తీసుకున్న విషయమేగా అని పేర్కొన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పరితపించే స్టాలిన్ ఎప్పుడూ తనకు పలాన పదవి కావాలని ఎవర్నీ అడిగింది లేదని, ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఒక దాని తర్వాత మరొకటి దక్కుతూ వస్తున్నాయని వివరించారు. అయితే, అధినేత కరుణానిధితో, తనతో స్టాలిన్‌కు విభేదాలు ఉన్నట్టుగా మీడియా కథనాలు సృష్టిస్తుండటం కొన్ని సందర్భాల్లో విస్మయానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదు అని, ప్రజలకు సేవ చేయాలన్నదే తన తపనగా స్పష్టం చేశారు. జయలలిత జైలుకు వెళ్లినంత మాత్రమే ఆమె మీద సానుభూతి పవనాలు లేవు అని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారం లేదు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.