రాయచూరు టౌన్, న్యూస్‌లైన్ : ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి రైతులు అధిక లాభాల పొందాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ బీవీ.పాటిల్ కోరారు. వర్శిటీ సభాభవనంలో శుక్రవారం గుర్గావ్ పీఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరి విత్తనాలు నేరుగా విత్తే, వరి కోత యంత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
దేశంలో రైతులు పంటలు పండించేందుకు ఎక్కువగా నీటిని వాడుతున్నారని, అయితే విదేశాల్లో రైతులు తక్కువ నీటితో ద్విదళ ధాన్యాలను పండిస్తూ లాభాలు గడిస్తున్నారన్నారు. ఇక్కడ ఆయకట్టు చివరి భాగం రైతులు నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మూడేళ్ల క్రితం భీమరాయనగుడిలో నేరుగా విత్తడం ఒక ఎకరంతో మొదలైందని, ప్రస్తుతం 60 వేల ఎకరాలకు చేరిందన్నారు.
ఇది రైతన్నలకు ఎంతో అనుకూలమన్నారు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు లభించే సబ్సిడీని నేరుగా రైతుల అకౌంట్లలో జమచేసేలా శాఖాధికారితో చర్చించాలన్నారు. దీని వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గొట్టు వరి సాగు గురించి సంబంధిత రైతులు తమ అనుభవాలను, సాధించిన లాభాలను వివరించారు. ఆ కంపెనీ చీఫ్ కపూర్, ఉద్యానవన మండలి డెరైక్టర్ గురుసిద్ధయ్య, రైతులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక లాభాలు
Published Sat, Dec 7 2013 4:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement