సాక్షి, ముంబై: నగరంలో నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేసే దిశగా రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. ఈ రద్దీ రైల్వే స్టేషన్లను ఆధునీకీకరణ పనులు చేపట్టేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్వీసీ) ఆలోచిస్తోంది. తొలి విడతగా దాదర్, కుర్లా, బోరివలి రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. తరువాతి దశలో అంధేరి, కళ్యాణ్, ఠాణే స్టేషన్లలో కూడా పనలు చేపడతారు. కార్పొరేషన్ ఈ ప్రతిపాదనలపై త్వరలోనే రైల్వే సీనియర్ అధికారులతో చర్చించనుంది. రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేపట్టే విషయంలో రాష్ట్రప్రభుత్వం, రైల్వే శాఖ కూడా ఆసక్తి చూపుతున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ అభివృద్ధి పనుల నిర్వహణకు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సేకరించనున్నట్ల ఎంఆర్వీసీ మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ సక్సేనా తెలిపారు. ఠాణేలో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌కు వచ్చే స్పందనను పరిగణనలోకి తీసుకొని ప్రతి ప్లాట్‌ఫాంపై ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడానికి ఎంఆర్‌వీసీ ఆలోచిస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి, రైలు దిగిన ప్రయాణికులు నేరుగా రైల్వే స్టేషన్ బయట బస్టాండ్, ఆటో స్టాండ్ వరకు వెళ్లే విధంగా వీలు కల్పించనున్నట్లు రాకేష్ సక్సేనా తెలిపారు. ప్లాట్‌ఫాంలను కేవలం ప్రయాణికుల వరకు పరిమితం చేయాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఫుడ్ స్టాల్స్, టికెట్ కౌంటర్లు, కార్యాలయాలు, బుక్ స్టాల్స్, మరుగుదొడ్లు తదితరాలను మరో చోటికి మార్చనున్నట్లు వివరించారు. ప్లాట్‌ఫాం పైన డెక్ నిర్మించి దానిపైకి ఈ స్టాల్స్‌ను తరలించనున్నట్లు ఆయనన్నారు.
అయితే ఈ రైల్వే స్టేషన్లలో రోజురోజుకు రద్దీ పెరిగి పోతుండడంతో ప్లాట్‌ఫాంలపై ఎలాంటి స్టాల్స్‌ను ఏర్పాటు చేయకుండా కేవలం ప్రయాణికులకే పరిమితం చేయడంతో ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందనీ భావిస్తున్నామన్నారు. ఈవిధంగా అయితే ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా వేగంగా రాకపోకలు జరిపే అవకాశం ఉంటుందని వివరించారు. పెరుగుతున్న రద్దీతో ఇప్పటికే నగరంలోని రైల్వే స్టేషన్లు ఇరుకుగా మారాయి. దీని వలన స్థలాభావం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు నగరంలోని రైల్వే స్టేషన్లలో ఎక్కువ భాగం వంద సంవత్సరాల పురాతనమైనవి. వీటి ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయా స్టేషన్లను బట్టి వాటికి తగిన నమూనాలను రూపొందించి ఆధునీకరిస్తామని ఎంఆర్‌వీసీ అధికారి పేర్కొన్నారు.
త్వరలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
Published Wed, Sep 4 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement