పొత్తు కుదిరిందా?
రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ?
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అంతరంగం
పీఎం భేటీతో సూత్రప్రాయ అంగీకారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీ ఎంకే, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ సయోధ్య కుదిరిందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు మిత్రపక్షాలుగా మారి పొత్తుపెట్టుకోనున్నాయా? చెన్నైలో మోదీ, జయ మధ్య సాగిన రహస్య భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందా? అనే ప్రశ్నలకు రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం పొత్తు వార్తలను ధ్రువీకరిస్తున్నారు. బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య పొత్తు తమిళనాడుకు కొత్తేమీ కాదు. ప్రధాని వాజ్‌పేయి హయాంలో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుని ఒకే ఒక్క ఓటుతో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని చిత్తుచేసిన సంగతి ఎవ్వరూ మరువలేదు. అయితే ఆనాటి రాజకీయ పరిస్థితులు వేరు నేటి పరిస్థితులు వేరు. మోదీతో జయకున్న స్నేహ సంబంధాలు ప్రత్యేకమైనవి. అంతేగాక జయకు, బీజేపీ ప్రభుత్వానికి పరస్పర సహకారం అవసరం.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్లే బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య మళ్లీ పొత్తు చిగురించింది. తాజా పార్లమెంటు ఎన్నికల సమయంలోనే అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. అయితే ఒంటరిగా పోటీచేయాలన్న జయ ఏ పార్టీతోనూ పొత్తుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ వ్యవహారం అంతా జరిగి ఏడాది దాటిపోగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త ఎత్తులు, పొత్తులకు తెరలేచింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత తమిళనాడులో పార్టీ బలోపేతానికి ప్రత్యేక దృష్టిసారించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను అనేక సార్లు తమిళనాడు పర్యటనకు పురమాయించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్ది డీఎంకే సమాయుత్తం అవుతూ కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, మనిదనేయ మక్కల్ కట్చిలకు చేరువవుతోంది.
పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏర్పడిన కమలనాధుల కూటమిలోని పార్టీలు ఆ తరువాత ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ దశలో అన్నాడీఎంకే, బీజేపీ మద్య స్నేహసంబంధాలు మొగ్గతొడగడం ప్రారంభించాయి. జాతీయ చేనేత దినోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలితను ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే అనూహ్యరీతిలో జయ నేరుగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. మద్రాసు సెంటినరీ ఆడిటోరియంలో చేనేత సదస్సు ముగియగానే ప్రధాని మోదీ పోయస్‌గార్డన్‌లోని జయ ఇంటికి పయనం అ య్యారు. మోదీతోపాటూ కేంద్ర మంత్రి పొన్ రా ధాకృష్ణన్ కూడా జయ ఇంటికి వెళ్లేందుకు కాన్వాయ్ సిద్దం అయింది. అయితే మోదీ తాను ఒక్కడినే వెళుతున్నట్లు తెలిపి పొన్ రాధాకృష్ణన్‌ను నిలిపివేశారు.
సరిగ్గా 50 నిమిషాల పాటూ మో దీ, జయల మధ్య సాగిన భేటీలో రెండు పార్టీల మధ్య పొత్తు ప్రధాన అంశమని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన ప్రత్యర్ది కాంగ్రెస్, అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్ది డీఎంకేలను మట్టికరిపించేందుకు పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని అంచనాగా ఉంది.పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం కు దరగా సీట్ల సర్దుబాటు వరకు జయ, మోదీల మ ద్య చర్చలు సాగినట్లు సమాచారం. బీజేపీకి 65 స్థానాలను కేటాయించాలని కోరగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు కేటాయించినట్లుగా 40 స్థానాలకు జయ సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. సీట్లమాటెలా ఉన్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మిత్రపక్షాలుగా కలిసి పోటీచేయడం ఖాయమని భావించాల్సి వస్తోంది.
రహస్య స్నేహం బట్టబయలు: ఇళంగోవన్
అన్నాడీఎంకే, బీజేపీల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న రహస్య స్నేహం ప్రధాని మోదీ సీఎం జయ ఇంటికి వెళ్లడంతో బట్టబయలైందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ఈరెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు సాగుతున్నట్లు కాంగ్రెస్ ఏనాడో చెప్పిందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీచేయడం ఖాయమని కూడా స్పష్టమైందని చెప్పారు.