
కోర్టుకు మోహనాంబల్ హాజరు
వేలూరు: వేలూరు సమీపంలోని తారాపడవేడులో రూ.4 కోట్ల 4లక్షల 73,500 నగదు, 73 సవరాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో వసంతపురానికి చెందిన కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ బుధవారం మధ్యాహ్నం కాట్పాడి కోర్టులో హాజరయ్యారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 4న పోలీ సులు తనిఖీలు నిర్వహించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న మోహనాంబాల్, సోదరి నిర్మల ఈనెల 9వ తేదీన వేలూరు కోర్టులో లొంగిపోయారు.
అయితే విచారణ జరిపిన న్యాయమూర్తి కాట్పాడి కోర్టులో 11వ తేదీన హాజరు కావాలని తీర్పు నిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మోహనాంబాల్, సోదరి నిర్మల కాట్పాడి కోర్టులో హాజరయ్యారు. మోహనాంబల్‌ను పోలీస్ కస్టడికీ ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు నిచ్చారు. మోహనాంబాల్ మాత్రం తాను వడ్డీ వ్యాపారం చేసి నగదు, బంగారం సంపాదించానని తెలిపినా పోలీసులు నమ్మడం లేదు. పరారీలో ఉన్న మోహనాంబాల్ సోదరి కుమారుడు శరవణన్ వద్ద విచారణ జరిపితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మోహనాంబాల్, సోదరి నిర్మల వద్ద మూడు రోజుల పాటు రహస్య విచారణ జరపనున్నారు.