
అమ్మ పూజల జోరు
అన్నాడీఎంకే శ్రేణుల గుండెల్లో కౌంట్‌డౌన్ మొదలైంది. జయలలిత మెడకు చుట్టుకున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు త్వరలో తీర్పుచెప్పబోతున్న తరుణంలో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు నుంచి ఆమె సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తూ మం త్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజల జోరు పెంచారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని జయలలిత అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమెపై మోపబడిన కేసు 18 ఏళ్లపాటు నడిచింది. ఆరోపణలు నిర్ధారణ అయినట్లు ప్రకటించిన బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదే కేసులో సహ నిందితులైన శశికళ, ఇళవరసి, సుధాకర్‌కు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది.
ఈ తీర్పుపై జయ కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేయగా న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో విరామమెరుగని విచారణ సాగింది. ప్రయివేటు సంస్థలు తమ వాదనను ఫిబ్రవరి 23వ తేదీతో ముగించాలని, ఆ తరువాత ప్రభుత్వ న్యాయవాది భవానిసింగ్ తన చివరి వాదనను పూర్తిచేయగానే తీర్పు తేదీని ప్రకటిస్తామని న్యాయమూర్తి కుమారస్వామి స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలో జయ అప్పీలుపై న్యాయమూర్తి తీర్పు ఖాయమనే ప్రచారం సాగుతోంది. అంతేగాక ఈ కేసు నుంచి అమ్మ బయటపడుతుందని విశ్వసిస్తున్నారు.
మంత్రుల మహాయాగాలు
కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పబోతున్న తరుణంలోనే జయ జన్మదినం (గత నెల 24వ తేదీ) రావడంతో పార్టీ అంతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతోంది. కేసు నుంచి జయ బయటపడాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుధవారం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి వలర్మతి బుధవారం ఒక్కరోజునే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నుంగంబాక్కం అగస్తీశ్వరన్ కోవిల్‌లో 67 మంది శివార్చకులతో మహారుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ఓంశక్తి వినాయగర్ ఆలయంలో సైదాపేట ఎమ్మెల్యే సెందమిళన్ హోమాలు, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించగా, మంత్రి వలర్మతి పాల్గొన్నారు. నగరంలో మరికొన్ని చోట్ల నిర్వహించిన అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఓట్టేరిలోని గోమాత ఆలయంలో రెండు వేల పశువులకు పూజలు చేశారు. దక్షిణ చెన్నై పార్టీ నేతలు ఆస్పత్రుల్లోని రోగులకు దోమతెరలు, హార్లిక్స్, పౌష్టికాహారం పంపిణీ చేశారు.
రాయపురంలో ఉచితై వెద్యశిబిరాన్ని నిర్వహించారు. వడపళని మురుగన్ ఆలయంలో టీ నగర్ ఎమ్మెల్యే కలైరాజన్ బంగారు రథోత్సవాన్ని జరిపారు. తిరునెల్వేలీ స్వయంభు లింగస్వామి ఆలయంలో 167 మందికి అన్నదానం, 67 మందికి చీరలు, పంచెలు పంపిణీ చేశారు. మధురైలో వేలాది మంది మహిళలు ఊరేగింపుగా తెప్పకుళం మారియమ్మన్ ఆలయానికి చేరుకుని పొంగళ్లు పెట్టారు.