తల్లి, తమ్ముడిని కడతేర్చిన అన్న
సేలం: తల్లి, తమ్ముడ్ని ఓ అన్న అతి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చాడు. అయితే అతడు మానసిక రోగిగా అనుమానాలు బయలు దేరడంతో ఆసుపత్రికి తరలించారు. వాలప్పాడిలో బుధవారం ఈ ఘాతుకం చోటు చేసుకుంది.
సేలం జిల్లా వాలప్పాడి సమీపంలో నడు పట్టి గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, రాజమ్మాల్ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో సెంథిల్(35) పెద్ద వాడు. రాజశేఖరన్(32) చిన్నవాడు. కుమార్తె విజయ. వీరి లో రాజశేఖరన్, విజయలకు వివాహాలు అయ్యాయి. వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే, పెద్దవాడు రాజశేఖరన్‌కు వివాహం కాలేదు. తండ్రి సుబ్రమణ్యం ఇటీవల మరణించడంతో ఆయన పనిచేస్తున్న ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాన్ని రాజమ్మాల్‌కు తపాలా శాఖ కల్పించింది.
దీంతో పెద్దవాడి పెళ్లిని పక్కన పెట్టిన రాజమ్మాల్ విధుల మీదే ఎక్కువ దృష్టిపెట్టింది. తనకు పెళ్లి చేయాలంటూ పదే పదే సెంథిల్ తల్లి మీద ఒత్తిడి తెచ్చేవాడు. అతడికి ఎలాంటి సంపాదన లేని దృష్ట్యా, తన సంపాదన మీద ఆధార పడాల్సి ఉండడంతో అతడికి వివాహం చేయకుండా రాజమ్మాల్ కాలం నెట్టుకు వచ్చి ఉన్నది. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి రెండు రోజుల క్రితం రాజశేఖరన్ గ్రామానికి వచ్చాడు. తన పెళ్లి మీద తమ్ముడు కూడా పట్టించుకోక పోవడంతో సెంథిల్ ఉన్మాదిగా మారాడు. బుధవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న తన తమ్ముడ్ని కత్తితో గొంతు కోసం హతమార్చాడు. దీన్ని అడ్డుకునే యత్నం చేసిన రాజమ్మాల్ గొంతును సైతం కోసి పడేశాడు.
పెద్ద ఎత్తున కేకలు పెడుతూ తాను కూడా గొంతు కోసుకునే యత్నం చేశాడు. ఉరి పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇంట్లో నుంచి వస్తున్న శబ్దంతో పరుగులు తీసిన ఇరుగు పొరుగు వారు అక్కడ దృశ్యాల్ని చూసి ఆందోళనలో పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న సెంథిల్‌ను పట్టుకుని చెట్టుకు కట్టి పడేశారు. సమాచారం అందుకున్న సేలం ఎస్పీ సుబ్బులక్ష్మినేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. రాజమ్మాల్, రాజశేఖరన్‌లు సంఘటనా స్థలంలోనే విగత జీవిగా మారడంతో మృత దేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు.
సెంథిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గొంతు కోసుకోవడంతో స్వల్పంగా గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం సేలం జిహెచ్‌కు తరలించారు. కాగా, సెంథిల్ మానసిక రోగిగా ఆ పరిసర వాసులు పేర్కొంటున్నారు. అతడు రెండేళ్లు చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్సను సైతం పొంది ఉన్నట్టు పేర్కొనడంతో అరెస్టు విషయంగా పోలీసులు సంయమనం పాటిస్తున్నారు. వైద్యులు జరిపే పరీక్షల అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా అతడు మానసిక రోగినా, లేదా అన్నది తేలనున్నది. వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఎస్పీ సుబ్బులక్ష్మి పేర్కొన్నారు.