చోరీ నెపంతో వేధింపులు
► తల్లీ కూతుళ్లను వివస్త్రను చేసి అవమానించిన మార్వాడీ కుటుంబం
► యువతి అత్మహత్య
► మార్చురీ వద్ద దళిత సంఘాలు ధర్నా
► మృతదేహాన్ని పరిశీలించిన
► జిల్లా కలెక్టర్, ఎస్పీలు
బళ్లారి (తోరణగల్లు) : నగరంలోని బెంగుళూరు రోడ్డులోని పూలమార్కెట్‌లో ఓ మార్వాడీ యజమాని ఇంట్లో ఉంగరాలు కనిపించ లేదని దళితులైన పని మనుషులను వేధించడంతో అవమానం భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల బంధువుల వివరాలు... బండిమోట్ ప్రాంతానికి చెందిన ఎర్రెమ్మ (40), ఆమె కూతురు అంజలి (18)లు పూలమార్కెట్‌లోని చింటూ సేట్ ఇంట్లో పనిమనుషులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత నెల 15న ఇంట్లో ఉంగరాలు కనిపించలేదని, వాటిని పనిమనుషులు అంజలి, ఎర్రెమ్మలు దొంగలించారనే నెపంతో చింటూ మరో ముగ్గురు వ్యక్తులు కలిసి యువతిని, ఆమె తల్లిని ఇద్దరినీ వివస్త్రలను చేసి ఉంగరాల కోసం శోధించారు. దీంతో అవమానం భరించలేక అంజలి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే పరిసర వాసులు గ మనించి మంటలను ఆర్పి బాధితురాలిని విమ్స్‌కు తరలించారు.
ఈ ఘటనపై ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా చికిత్స పొందుతూ అంజలి శనివారం మృతి చెందింది. దీంతో దళిత సంఘాల కార్యకర్తలు శనివారం మార్చురీ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వేధింపులకు గురి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, మృతురాలి తల్లికి పరిహారం చెల్లించి ప్రభుత్వోద్యోగం, పక్కా ఇళ్లు మంజూరు చేయాలనే డిమాండ్లతో నినాదాలు చేశారు.
జిల్లా కలెక్టర్ సమీర్‌శుక్లా, ఎస్పీ చేతన్‌లు విమ్స్ మార్చురీ వద్దకు చేరుకొని మాట్లాడుతూ... నిందితుల్లో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, బెయిల్‌పై బయటకొచ్చారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నాము. చట్టం ప్రకారం నిందితుకు శిక్షపడే విధంగా చూస్తామని, మృతురాలి తల్లికి ప్రభుత్వంతో చర్చించి పరిహారం, పక్కాగృహం, ఉద్యోగం రావడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంజలి మృతదేహాన్ని పరిశీలించారు.