మౌళివాక్కం బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సమగ్ర నివేదిక ఎక్కడంటూ మద్రాసు హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ కేసు విచారణ సందర్భంగా సోమవారం వాదనలు వాడీవేడిగా సాగాయి. డిసెంబరు నాలుగవ తేదీలోపు సమగ్ర నివేదిక దాఖలు చేయూలని ప్రభుత్వానికి కోర్టులు ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, చెన్నై:పోరూర్ సమీపంలోని మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం రెండు నెలల క్రితం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, నిర్మాణంలో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కన్పించినా చర్యలు అంతంతమాత్రమే. ఈ ఘటనను ప్రతి పక్షాలు తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఈ ప్రమాదంలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 61 మంది మృతి చెందారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్: భవనం కూలిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఆ భవనంలో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందస్తుగా లక్షల్లో అడ్వాన్స్‌లు ఇచ్చిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, బాధితులకు నష్ట పరిహారం పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
సీఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన దృష్ట్యా సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని తన పిటిషన్‌లో ట్రాఫిక్ రామస్వామి విజ్ఞప్తి చేశారు. స్టాలిన్, ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున తాత్కాలిక నివేదిక బెంచ్ ముందుకు వచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం వాదనలు వాడీవేడిగా సాగాయి. స్టాలిన్ తరపున హాజరైన న్యాయవాది విల్సన్ ప్రభుత్వ నివేదికను తప్పుబట్టారు. ఆగమేఘాలపై మొక్కుబడిగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించారని ఆరోపించారు.
నిర్మాణంలో ఉన్న భవనాల్ని సీఎండీఏ వర్గాలు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నా, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జోక్యం చేసుకుని గత ప్రభుత్వం హయంలో ఇదే రకంగా తనిఖీలు జరిగాయా..? అంటూ ప్రశ్నించారు. కాస్త ఇరకాటంలో పడ్డ స్టాలిన్ తరపు న్యాయవాది చివరకు ఆ వివరాలు తెలియదని, సీఎండీఏ నిబంధనల్ని తాను ప్రస్తావిస్తున్నట్టు దాటవేత ధోరణి ప్రదర్శించారు. చివరకు న్యాయమూర్తులు జోక్యం చేసుకుని తాత్కాలిక నివేదిక కాదని సమగ్ర నివేదిక ఎక్కడంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించారు. అన్ని రికార్డులు, నమోదైన కేసులు, తీసుకున్న చర్యలు, ఆ భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వివరాలతో సమగ్ర నివేదికను దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబరు నాలుగో తేదీకి వాయిదా వేశారు.
సమగ్ర నివేదిక ఏదీ?
Published Tue, Oct 14 2014 1:26 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement