Moulivakkam
-
సమగ్ర నివేదిక ఏదీ?
మౌళివాక్కం బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సమగ్ర నివేదిక ఎక్కడంటూ మద్రాసు హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ కేసు విచారణ సందర్భంగా సోమవారం వాదనలు వాడీవేడిగా సాగాయి. డిసెంబరు నాలుగవ తేదీలోపు సమగ్ర నివేదిక దాఖలు చేయూలని ప్రభుత్వానికి కోర్టులు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, చెన్నై:పోరూర్ సమీపంలోని మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం రెండు నెలల క్రితం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, నిర్మాణంలో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కన్పించినా చర్యలు అంతంతమాత్రమే. ఈ ఘటనను ప్రతి పక్షాలు తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఈ ప్రమాదంలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 61 మంది మృతి చెందారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్: భవనం కూలిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఆ భవనంలో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందస్తుగా లక్షల్లో అడ్వాన్స్‌లు ఇచ్చిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, బాధితులకు నష్ట పరిహారం పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన దృష్ట్యా సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని తన పిటిషన్లో ట్రాఫిక్ రామస్వామి విజ్ఞప్తి చేశారు. స్టాలిన్, ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున తాత్కాలిక నివేదిక బెంచ్ ముందుకు వచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం వాదనలు వాడీవేడిగా సాగాయి. స్టాలిన్ తరపున హాజరైన న్యాయవాది విల్సన్ ప్రభుత్వ నివేదికను తప్పుబట్టారు. ఆగమేఘాలపై మొక్కుబడిగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించారని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న భవనాల్ని సీఎండీఏ వర్గాలు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నా, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జోక్యం చేసుకుని గత ప్రభుత్వం హయంలో ఇదే రకంగా తనిఖీలు జరిగాయా..? అంటూ ప్రశ్నించారు. కాస్త ఇరకాటంలో పడ్డ స్టాలిన్ తరపు న్యాయవాది చివరకు ఆ వివరాలు తెలియదని, సీఎండీఏ నిబంధనల్ని తాను ప్రస్తావిస్తున్నట్టు దాటవేత ధోరణి ప్రదర్శించారు. చివరకు న్యాయమూర్తులు జోక్యం చేసుకుని తాత్కాలిక నివేదిక కాదని సమగ్ర నివేదిక ఎక్కడంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించారు. అన్ని రికార్డులు, నమోదైన కేసులు, తీసుకున్న చర్యలు, ఆ భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వివరాలతో సమగ్ర నివేదికను దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబరు నాలుగో తేదీకి వాయిదా వేశారు. -
అనుమతులకు బ్రేక్!
- నగరంలో ఆగిన నిర్మాణాలు - కమిషన్ నివేదికతో తదుపరి చర్యలు - మౌళివాకం ప్రమాదం ఎఫెక్ట్ సాక్షి, చెన్నై: మౌళివాకంలో ప్రైమ్ సృష్టి సంస్థకు చెందిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 61 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటన అటు అధికారులను, ఇటు నిర్మాణ రంగంలో ఉన్న వారిని కలవరంలో పడే సింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన సీఎండీఏ వర్గాలను వీడటం లేదు. ఆ భవన నిర్మాణంలోని నాణ్యత లోపం కుప్పకూలడానికి ప్రధాన కారణంగా తేలడంతో అధికారులకు ముచ్చెమటలు పెడుతున్నారు. అలాగే, ఏదేని సంఘటన జరిగినప్పుడే స్పందిస్తామన్నట్టుగా ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యత మీద దృష్టి పెట్టే పనిలో అధికారులు పడ్డారు. ఇప్పటి వరకు 400 భవనాలను పరిశీలించారు. కొన్నింటికి నోటీసులు జారీ అయ్యాయి. మరికొన్ని భవనాల నిర్మాణాలను నిలిపేశారు. మరో 300 భవనాలను పరిశీలించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మౌళివాకం ఘటనపై విచారణ వేగవంతం కావడం రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలోని కమిషన్ నివేదిక సిద్ధం చేయడానికి సిద్ధమవుతుండడంతో సీఎండీఏ వర్గాలు కలవరంలో పడ్డాయి. అనుమతులకు బ్రేక్: ప్రత్యేక కమిషన్ నివేదిక తమ మెడకు చుట్టుకునేలా ఉన్న పక్షంలో ఇరకాటంలో పడుతామన్న బెంగ సీఎండీఏ వర్గాల్ని వెంటాడుతోంది. దీంతో ఆ నివేదిక వచ్చే వరకు అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చారు. నెల రోజులుగా కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో అనుమతి దరఖాస్తుల జాబితా రోజురోజుకూ పెరిగి పోతోంది. ఇప్పుడు అనుమతుల్ని మంజూరు చేస్తే, ఏదేని సవరణలు, నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరం వచ్చిన పక్షంలో తదుపరి భవన యజమానుల వద్దకు అధికారులు పరుగులు తీయాల్సి ఉంటుందని, అందుకే అనుమతులు ఇవ్వడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రత్యేక కమిషన్ తన నివేదికలో తప్పనిసరిగా కొత్త సూచనలు సలహాలు ఇవ్వడం ఖాయమని, అలాగే, ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. ఇది వరకు ఇచ్చిన అనుమతుల మేరకు అడ్డగోలుగా నిర్మించిన భవనాల్ని క్రమబద్ధీకరించేందుకే తలలు పట్టుకోవాల్సి వస్తోందని మరో అధికారి పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు భవన యజమానులకు పడిగాపులు తప్పవని ఆ అధికారి స్పష్టం చేశారు. ఆగిన నిర్మాణాలు: నగర శివారుల్లో కొన్ని బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలు ఓ వైపు అనుమతులకు దరఖాస్తులు చేసుకుని, మరో వైపు నిర్మాణ పనులు చేపట్టాయి. తాజాగా, అనుమతుల మంజూరుకు బ్రేక్ పడటంతో ఉన్న ఫలంగా నిర్మాణాలు ఆపుకోవాల్సిన పరి స్థితి. అనుమతులు దక్కుతాయన్న ధీమాతో నిర్మాణాలు చేపట్టిన అనేక సంస్థలు, ఇప్పుడు వెనక్కు తగ్గక తప్పడం లేదు. పునాదుల దశలో అనేక భవనాల నిర్మాణాలు నెల రోజులుగా ఆగి ఉన్నాయి. దీంతో కూలీలు పనులు లేక గగ్గోలు పెట్టాల్సి వస్తోంది. రోజు వారీ వేతనాల మీద ఆధార పడిన కూలీలు, పనులు లేని దృష్ట్యా, కొందరు స్వగ్రామాల బాట పడుతుం టే, మరి కొందరు ప్రత్యామ్నాయ పనుల మీద దృష్టి పెట్టారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు మరెందరో సీఎండీఏను ఆశ్రయించారు. ఈ బహుళ అంతస్తుల అడ్డగోలు నిర్మాణాల పుణ్యమా అని, తమ ఇళ్ల నిర్మాణాలకు సైతం అనుమతులు మంజూరు కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎండీఏ అనుమతులు వచ్చే నాటికి స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగిన పక్షంలో తమ మీద భారం తప్పదంటూ సొంత ఇంటి కల సాకారం చేసుకునే పనిలో ఉన్న మధ్య తరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ కమిషన్ ఏకపక్షం..!
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలో జరిగిన అపార్ట్మెంటు ప్రమాదం అసెంబ్లీని కుదిపేసింది. ఆ సంఘటనపై విచారణకు నియమించిన రఘుపతి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారుు. దీనికి అధికార పక్షం అడ్డుతగలడంతో వామపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ సంఘటనలు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 2014-15 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం నాలుగురోజుల తర్వాత వాయిదా వేసింది. సహజంగా బడ్జెట్‌పై శాఖల వారీగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా గురువారం సమావేశాలు ప్రారంభమయ్యూరుు. ఉదయం 9.52 గంటలకు ముఖ్యమంత్రి జయలలిత సమావేశం హాలులోకి అడుగుపెట్టారు. కేంద్రమంత్రి గోపినాధ్ ముండే, మౌళివాక్కం, తిరువళ్లూరులో మృతులకు సంతాప సూచకంగా స్పీకర్ ధనపాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం అరగంటపాటూ వాయిదా వేశారు. ఆ తరువాత అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగా అపార్ట్మెంటు ప్రమాదంపై సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా డీఎంకే సభ్యులు స్టాలిన్ స్పీకర్‌ను కోరారు. డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు సైతం స్టాలిన్‌తో గళం కలిపాయి. మాజీ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో న్యాయవిచారణ జరుగుతున్నందున చర్చించడం సముచితం కాదని స్పీకర్ బదులిచ్చారు. ఇందుకు సమ్మతించ ని ప్రతిపక్షాల నేతలు లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్పీకర్ సైతం లేచి నిలబడి సభ నిబంధనల ప్రకారం కూర్చోవాలని కోరారు. సీపీఎం సభ్యులు భీమ్రావ్ ఇదే అంశాన్ని లేవనెత్తడంతో గృహ నిర్మాణశాఖా మంత్రి వైద్యలింగం జోక్యం చేసుకుని తాను చెప్పే విషయాలను సావధానంగా వినండి, సంతృప్తి లేకుంటే వాకౌట్ చేయండని చెప్పారు. చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ)వారు నిబంధనలకు లోబడే అనుమతులు మంజూరు చేశారని, నిర్మాణంలో లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిల్డర్, స్ట్రక్చరల్ ఇంజనీరుదేనని పేర్కొన్నారు. ప్రైవేటు నిర్మాణాల్లో జరిగిన ప్రమాదాలకు ప్రభుత్వంతో సంబంధం లేదని, అయినా జయ ప్రభుత్వం మానవతా దృ క్పథంతో వ్యవహరించి బాధిత కుటుంబాలను ఆదుకుందని అన్నారు. ఇవన్నీ తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రమాద తీవ్రతపై పారదర్శక విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిందని విపక్షాల నాయకులు తప్పుపట్టారు. ఇది ఏకసభ్య కమిషన్ కాదు ఏకపక్ష కమిషన్ అంటూ డీఎండీకే సభ్యులు చంద్రకుమార్ ఎద్దేవా చేశారు. డీఎంకే సభ్యులు స్టాలిన్, కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్, సీపీఎం సభ్యులు సౌందర్‌రాజన్ తదితరులంతా సీబీఐ విచారణకు ఆదేశించాలని లేచి నిలబడి నినదించారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను తీసిపారేస్తున్నట్లుగా అధికార పార్టీ సభ్యులు వాగ్విదానికి దిగడంతో డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియకళగం తదితర పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలంతా వాకౌట్ చేశారు. -
ఉలిక్కిపడ్డ చెన్నై
సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని చెన్నై శివారులోని పోరూరు మౌళివాక్కంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర దుర్ఘటన ప్రజానీకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంత పెద్ద భవనం కుప్పకూలడమన్నది ఇదే ప్రప్రథమంగా కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా రు. కళ్లెదుటే భారీ భవనం కుప్పకూలుతుండడాన్ని చూసిన మౌలివాక్కం పరిసరాల్లోని నిర్వాసితులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు. తమవాళ్లకేమైం దంటే తమవాళ్లకేమైందంటూ జాడ కోసం రోదిస్తూ కొందరు, శిథిలాల కింద తమ వాళ్లు సురక్షితంగా ఉండాలంటూ ప్రార్థనలు చేస్తూ కొందరు గడిపారు. చెన్నై మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తూ పోతున్నది. పోరూరు సమీపంలోని మౌళివాక్కం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం నాటి సంఘటన ఇందుకు తర్పణం పడుతోంది. రెండేళ్ల వ్యవధిలో రెండు 11 అంత స్తులతో కూడిన రెండు బహుళ భవనాలను ట్రస్టు హైట్స్ సంస్థ నిర్మించేసింది. ఈ భవనంలో గత కొద్ది రోజుల వరకు సుమారు 200 మంది వరకు పని చేస్తూ వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిందంటూ ఓ కార్మికుడు పేర్కొన్నాడు. భవనం కుప్పకూలుతున్న సమయంలో 11వ అంతస్తుడు ఉన్న ఓ యువకుడు అదృష్టం కొద్దీ క్షేమంగా బయటపడ్డాడు. జరిగిన ప్రత్యక్ష ఘటనను అతను మీడియాకు వివరిస్తుంటే ఆ పరిసరవాసులు ఆందోళనకు లోనుకావాల్సి పరిస్థితి. ఉలికిపాటు ప్రశాంతతకు నిలయంగా ఉండే చెన్నై మహానగర వాసులు ఇటీవల కాలంగా ఉలిక్కిపడుతున్నారు. తీవ్రవాదుల హెచ్చరికలు ఓ వైపు, రైలు ప్రమాదాలు మరో వైపు, షావుకారుపేటలో మరో వైపు ప్రజలను భయకంపితులను చేశాయి. తాజాగా బహుళ అంతస్తుల భవనాలంటే ఆమడ దూరం పరుగులు పెట్టే స్థితి ఏర్పడింది. తాజా ఘటన ప్రజలను ఉలిక్కిపడేలా చేయడంతోపాటుగా ఈ పరిణామాలు ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టిస్తాయోనన్న ఆందోళనను రేకెత్తిస్తోంది. లక్షలు పోసి కొనుక్కున్న ఫ్లాట్లు నాణ్యతా లోపాలతో ఎక్కడ కుప్పకూలుతాయోనన్న భయం నిర్వాసితుల్లో నెలకొంటోంది. ఆర్తనాదాలు మౌళివాక్కంలో శనివారం రాత్రి ఆర్తనాదాలు మిన్నంటాయి. బహుళ అంతస్తుల భవనం కూలిన సమాచారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తే మహానగరంలోని కూలీ కార్మికుల్లో వేదనను రగిలించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కొందరు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కొందరు ఈ శిబిరాల కింద చిక్కుకున్నారన్న సమాచారం చెన్నైలో కూలిపనులు చేసుకుంటున్న ఆ ప్రాంత వాసుల్ని ఆందోళనలో పడేసింది. తమ ప్రాంతానికి చెందినవారేమైనా ఉన్నారా అని వాకబుచేయడానికి కొందరు పరుగులు తీస్తే, మరి కొందరు సంబంధిత నిర్మాణ సంస్థలో తమ వారు పని చేస్తున్నారని ఆవేదనలో పడ్డారు. తమ వారి జాడ కానరాకపోవడంతో ఆందోళనలో పడ్డవారు, కొందరైతే, కన్నీటి పర్యంతంతో విలపిం చారు. మరి కొందరు తమ వారి జాడ ఎక్కడ అని పరుగులు తీసినా పోలీసులు ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. ముమ్మరంగా పనులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు కాగానే, పదవ అంతస్తు కూలిన ప్రదేశం నుంచి వచ్చిన హాహాకారాలతో రెస్క్యూ టీమ్ చాకచక్యంగా వ్యవహరించింది. ఓ వ్యక్తిని సురక్షితంగా అక్కడి నుంచి రక్షించారు. భారీ క్రేన్లు, వెల్డింగ్ మిషన్లు, ఫ్లడ్ లైట్లను హుటాహుటిన ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసి ఆపరేషన్‌ను తీవ్రతరం చేశారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్, రాష్ట్ర మంత్రి చిన్నయ్యలు సంఘటనా స్థలంలోనే తిష్టవేసి రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో రెండు ప్రత్యేక వైద్య బృందాలు, రామచంద్ర ఆస్పత్రి బృందం ఒకటి సంఘటనా స్థలంలో తిష్ట వేసి క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించే పనుల్లో నిమగ్నమైంది. ఆరోగ్య శాఖ డెరైక్టర్ గీతాలక్ష్మీ మాట్లాడుతూ వైద్యపరంగా సర్వం సిద్ధం చేశామని వివరించారు. వేగవంతం చేయండి బహుళ అంతస్థుల భవనం కూలిన సమాచారంతో సీఎం జయలలిత అధికారులకు ఆదేశాలిచ్చారు. సేవా కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచిం చారు. గవర్నర్ రోశయ్య దిగ్భ్రాంతి: ప్రమాద ఘటనై గవర్నర్ కొణిజేటి రోశయ్య దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. భవన శిథిలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండటం బాధాకరమన్నారు. అదుపులోకి నిర్వాహకులు ప్రమాద ఘటనపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. ట్రస్టు హైట్స్ సంస్థ నిర్వాహకులు ముత్తు, మనోహరన్‌ను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. రె వెన్యూ, పోలీసు అధికారులు ప్రధానంగా భవనం నాణ్యత, పరిణామాలపై దర్యాప్తు చేస్తున్నారు.