ఆ కమిషన్ ఏకపక్షం..!
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలో జరిగిన అపార్ట్‌మెంటు ప్రమాదం అసెంబ్లీని కుదిపేసింది. ఆ సంఘటనపై విచారణకు నియమించిన రఘుపతి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారుు. దీనికి అధికార పక్షం అడ్డుతగలడంతో వామపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ సంఘటనలు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 2014-15 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం నాలుగురోజుల తర్వాత వాయిదా వేసింది. సహజంగా బడ్జెట్‌పై శాఖల వారీగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా గురువారం సమావేశాలు ప్రారంభమయ్యూరుు. ఉదయం 9.52 గంటలకు ముఖ్యమంత్రి జయలలిత సమావేశం హాలులోకి అడుగుపెట్టారు. కేంద్రమంత్రి గోపినాధ్ ముండే, మౌళివాక్కం, తిరువళ్లూరులో మృతులకు సంతాప సూచకంగా స్పీకర్ ధనపాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం అరగంటపాటూ వాయిదా వేశారు.
ఆ తరువాత అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగా అపార్ట్‌మెంటు ప్రమాదంపై సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా డీఎంకే సభ్యులు స్టాలిన్ స్పీకర్‌ను కోరారు. డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు సైతం స్టాలిన్‌తో గళం కలిపాయి. మాజీ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో న్యాయవిచారణ జరుగుతున్నందున చర్చించడం సముచితం కాదని స్పీకర్ బదులిచ్చారు. ఇందుకు సమ్మతించ ని ప్రతిపక్షాల నేతలు లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్పీకర్ సైతం లేచి నిలబడి సభ నిబంధనల ప్రకారం కూర్చోవాలని కోరారు. సీపీఎం సభ్యులు భీమ్‌రావ్ ఇదే అంశాన్ని లేవనెత్తడంతో గృహ నిర్మాణశాఖా మంత్రి వైద్యలింగం జోక్యం చేసుకుని తాను చెప్పే విషయాలను సావధానంగా వినండి, సంతృప్తి లేకుంటే వాకౌట్ చేయండని చెప్పారు.
చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ)వారు నిబంధనలకు లోబడే అనుమతులు మంజూరు చేశారని, నిర్మాణంలో లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిల్డర్, స్ట్రక్చరల్ ఇంజనీరుదేనని పేర్కొన్నారు. ప్రైవేటు నిర్మాణాల్లో జరిగిన ప్రమాదాలకు ప్రభుత్వంతో సంబంధం లేదని, అయినా జయ ప్రభుత్వం మానవతా దృ క్పథంతో వ్యవహరించి బాధిత కుటుంబాలను ఆదుకుందని అన్నారు. ఇవన్నీ తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రమాద తీవ్రతపై పారదర్శక విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించిందని విపక్షాల నాయకులు తప్పుపట్టారు. ఇది ఏకసభ్య కమిషన్ కాదు ఏకపక్ష కమిషన్ అంటూ డీఎండీకే సభ్యులు చంద్రకుమార్ ఎద్దేవా చేశారు.
డీఎంకే సభ్యులు స్టాలిన్, కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్, సీపీఎం సభ్యులు సౌందర్‌రాజన్ తదితరులంతా సీబీఐ విచారణకు ఆదేశించాలని లేచి నిలబడి నినదించారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను తీసిపారేస్తున్నట్లుగా అధికార పార్టీ సభ్యులు వాగ్విదానికి దిగడంతో డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, వామపక్షాలు, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియకళగం తదితర పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలంతా వాకౌట్ చేశారు.