మీ రాజకీయాలకు మేమే దొరికామా?
► మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య
► సీబీఐ కోర్కె పిటిషన్ కొట్టివేత
► నామక్కల్ ఎస్పీపై నిషేదాజ్ఞలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘పార్టీ రాజకీయాలకు మేమే దొరికామా, అధికార, ప్రతిపక్ష రాజకీయ పోరు కోసం కోర్టులను రణభూమిగా వాడుకోరాదు’...ఈ వ్యాఖ్యలను చేసింది వేరెవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. న్యాయమూర్తుల నోటి నుంచి ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు వెనుక కథనం ఇలా ఉంది. ఈనెల 18వ తేదీన నామక్కల్ జిల్లా తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య సంఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీఎంకే మాజీ మంత్రి సుబ్బులక్ష్మి జగదీశన్ మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రస్తుతం సాగుతున్న సీబీసీఐడీ విచారణ వల్ల ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం ముందుకు బుధవారం విచారణకు వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న డీఎస్పీ విష్ణుప్రియకు, పిటిషనర్‌కు ఏమిటి సంబంధం, బంధువా అని పిటిషనర్ తరపున కోర్టుకు హాజరైన విల్సన్‌ను న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ను పిల్‌గా స్వీకరించేందుకు వీలులేదని పేర్కొన్నారు. దీంతో న్యాయవాది బదులిస్తూ సీబీఐ విచారణ జరపాలన్న కోర్కెతో మృతురాలి బంధువులచే పిల్ వేసేందుకు కొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తులను కోరారు. ఇందుకు సైతం న్యాయమూర్తులు నిరాకరిస్తూ, విష్ణుప్రియ బంధువులు కోర్టులో కేసును ప్రారంభించుకోవచ్చని అన్నారు. బంధువులు కేసు వేసేందుకు కోర్టు హామీ ఇచ్చినందున తమ పిల్‌ను ఉపసంహరిస్తున్నగా ఒక ఉత్తరం రాసి న్యాయవాది విల్సన్ న్యాయమూర్తులకు అందజేశాడు.
ఈ ఉత్తరాన్ని చదివిన న్యాయమూర్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. పిల్‌ను ఉపసంహరిస్తున్నట్లుగా మాత్రమే ఉత్తరం రాసి ఇవ్వాలి, హైకోర్టు అంటే రాజకీయ పోరు నడిపే రణభూమి కాదు అన్నారు. రాజకీయ పోరుకు మరోచోటు ఉంది, అక్కడికి వెళ్లండి అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో విస్తుపోయిన న్యాయవాది విల్సన్ న్యాయమూర్తులను క్షమాపణ కోరి, సరిచేసిన ఉత్తరాన్ని అందించాడు. పిల్‌ను న్యాయమూర్తులు కొట్టివేశారు. ఇదిలా ఉండగా డీఎస్పీ ఆత్మహత్యకేసు సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేస్ ఇళంగోవన్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు చెన్నైలో ఆందోళన నిర్వహించారు. కాగా, ఉన్నతాధికారుల వేధింపుల వల్లనే డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకున్నదనే ఆరోపణలు ఉన్నందున విచారణజిల్లాను విడిచి వెళ్లరాదని నామక్కల్ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను డీజీపీ బుధవారం ఆదేశించారు.
పరస్పర సవాళ్ల పర్వం: కోర్టుకు భద్రత కల్పించడంలో తమిళనాడు పోలీసులపై నమ్మకం లేదంటే మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీఎం జయలలిత, మాజీ సీఎం కరుణానిధి పరస్పర సవాళ్లను విసురుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తి అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, దీనిపై కరుణ స్వయంగా పిటిషన్ వేసి నిరూపించగలరా అంటూ సీఎం జయలలిత మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశంలో సవాల్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరించిన కరుణానిధి బుధవారం ప్రతి సవాల్ విసిరారు. హైకోర్టు భద్రతపై చోటుచేసుకున్న వ్యాఖ్యలను నిరూపించేందుకు తాను సిద్ధ మంటూ కరుణ పేర్కొన్నారు.