కన్నీటి నిరీక్షణ! | Rescue Operation Reached third day in Chennai | Sakshi
Sakshi News home page

కన్నీటి నిరీక్షణ!

Published Tue, Jul 1 2014 4:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

కన్నీటి నిరీక్షణ! - Sakshi

కన్నీటి నిరీక్షణ!

 సాక్షి, చెన్నై : మౌళివాకంలో రెస్క్యూ ఆపరేషన్ మూడో రోజుకు చేరింది. నిర్విరామంగా 40 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌లో జాతీయ విపత్తుల నివారణ బృందం, ప్రత్యేక శిక్షణ పొందిన హోం గార్డ్స్, కమాండోస్, వైద్య, రెవెన్యూ శాఖలు తమ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ఓ వైపు ఆపరేషన్ శరవేగంగా సాగుతున్నా, మరో వైపు తమ వాళ్ల జాడ కోసం కళ్లు కాయలు కాసేలా బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. తమ వాళ్లు బతికే ఉంటారన్న చిన్న ఆశ ఎక్కడో ఉన్నా, రోజులు గడుస్తున్న కొద్దీ తెలియని ఆందోళన ఆ కుటుంబాల్లో మొదలైంది.
 
 ఆప్తుల కోసం  
 భార్య కోసం, భర్త, భర్త కోసం భార్య, కుటుంబం కోసం ఆప్తులు, తల్లిదండ్రుల కోసం తనయుడు, తనయుడి కోసం తల్లిదండ్రులు, అమ్మానాన్నల కోసం చంటి బిడ్డలు ఇలా ....సర్వత్రా తమ వాళ్ల కోసం కన్నీటి వేదనలో మునిగి ఉన్నారు. శిథిలాల కింద నుంచి కొందరిని సురక్షితంగా వెలికితీసినా, వారిలో తమ వాళ్లు ఉన్నారో..లేదో అని తెలుసుకోలేని పరిస్థితి. రామచంద్ర ఆస్పత్రికి పరుగులు తీస్తే, అక్కడ సెక్యూరిటీల అడ్డు. దీంతో బతికి ఉన్న వారిలో  తమ వాళ్లు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితిలో బాధిత కుటుంబాలు ఉన్నా యి.
 
 శ్రీకాకుళంకు చెందిన తన సోదరి కళావతి, బావ రాము జాడ కోసం బావమరిది అప్పలరాజు అటు ఆస్పత్రికి, ఇటు సంఘటనా స్థలానికి పరుగులు తీస్తున్నాడు. తన సోదరి పిల్లలు మణిగండన్, సంజన తన వద్దే ఉన్నారని, వారిద్దరూ తమకు లేకుండా పోతే, ఆ పిల్లలకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియదంటూ రామచంద్ర ఆస్పత్రి వద్ద అప్పలరాజు విలపిస్తున్నాడు. అక్క, బావలు ప్రాణాలతో ఉండాలని దేవుడిని వేడుకుంటున్నట్టు అప్పలరాజు కన్నీటి సంద్రంలో మునిగాడు. తన భార్య జ్యోతి జాడ కానరాలేదంటూ శ్రీకాకుళంకు చెందిన సింహాచలం తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. కూలిన భవనంలో వంట చేస్తున్న జ్యోతి తన కళ్లేదుటే కిందకు కూరుకు పోయిందని, ఆమెను రక్షించలేని నిస్సహాయుడిగా మరో భవనం మీద తాను ఉండాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతున్నాడు.
 
 ఐదుగురికి శస్త్ర చికిత్స   
 రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురికి శస్త్ర చికిత్స నిర్వహించేందుకు  వైద్యులు నిర్ణయించారు. సంఘటనా స్థలం నుంచి రక్షితులైన 23 మందిని రామచంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు ఆరోగ్య శాఖ అధికారి కులందై వేల్  తె లిపారు. 22 మంది ఆరోగ్యంగానే ఉన్నారని, ఒకరిని మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇక్కడున్న 22 మందిలో ఐదుగురికి కాలు, చేతి బాగాల్లో ఎముకలు విరిగాయని, వీరికి శస్త్ర చికిత్స నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మిగి లిన వారిలో 15 మంది ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు.
 
 ఎక్స్‌గ్రేషియో పెంపు
 రాష్ట్రానికి చెందిన బాధితులకు ఎక్స్‌గ్రేషియోను పెంచుతూ సీఎం జయలలిత ఆదేశాలు ఇచ్చారు. మౌళివాకం బాధితులను ఆదివారం సీఎం జయలలిత పరామర్శించిన విష యం తెలిసిందే. మృతులకు రూ.రెండు లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేలు ప్రకటించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ బాధితులకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియో ప్రకటించడంతో, తమిళనాడు బాధితులకు ఎక్స్‌గ్రేషియోను పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. మృతుల్లో తమిళనాడుకు చెందిన నలుగురు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది వరకు ప్రకటించిన రెండు లక్షలతో పాటుగా మరో ఐదులక్షలు అందజేయనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి మృత దేహాల్ని ప్రభుత్వ ఖర్చుతో వారి స్వగ్రామాలకు పంపించనున్నామన్నారు. ఆస్పత్రి వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించారు.
 
 అధికారుల మెడకు ఉచ్చు  
 మౌళి వాకం ఘటన ఉచ్చు ఎక్కడ తమ మెడకు చుట్టుకుం టుందోనన్న భయం అధికారుల్లో గుబులు మొదలైంది. పోరూర్ డివిజన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు ఆయా భవనాల నిర్మాణ పనుల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు, ఇష్టారాజ్యంగా పంచాయతీ అనుమతుల్ని ఇచ్చేస్తూ, సీఎండీఏకు రెఫర్ చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ డివిజన్ పరిధిలోని అధికారుల్లో దడ మొదలైంది. ఎక్కడ తమను పోలీసులు విచారణకు పిలిపిస్తారోనన్న ఆందోళనలో పడ్డారు.
 
 జిరాక్స్ కాపీల్లో ఫొటోలు
 మృతుల వివరాలను వారి ఆప్తులు, బంధువులకు తెలియజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తమ వాళ్ల జాడ కోసం ఆస్పత్రి, సంఘటనా స్థలానికి ఆప్తులు పరుగులు తీస్తుండంతో సోమవారం సాయంత్రం కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ ఆదేశాలతో కాంచీపురం జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.  రాయపేట మార్చురిలో ఉన్న మృత దేహాలను ఫొటో తీసి, జిరాక్స్ కాపీల రూపంలో రామచంద్ర ఆస్పత్రి వద్దకు, సంఘటనా స్థలానికి వచ్చే ఆప్తులు, బంధువులకు అందించి, గుర్తించే పనిలో పడ్డారు. వారు ఇచ్చే సమాచారం, గుర్తించే మేరకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలని బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement