మరో ముప్పు!
సాక్షి, చెన్నై: బహుళ అంతస్తుల భవన నిర్మాణం పేక మేడలా కుప్పకూల డం దక్షిణ భారతంలో అతి పెద్ద ప్రమాదంగా పరిగణించవచ్చు. ఈ ప్రమాదం నేర్పిన గుణపాఠంతో అధికార యంత్రాంగం మేల్కొంది. భవిష్యత్తులో ఇలాం టివి పునరావృతం కాని విధంగా తగిన జాగ్రత్తలకు సిద్ధం అవుతోన్నది. రాజధాని నగరం, శివారు ల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాల్లో నిబంధనల అమలు మీద దృష్టి పెట్టేందుకు చెన్నై మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు అనుమతులు పొందిన, అనుమతుల కోసం వేచి ఉన్న భవనాలకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను పునఃపరిశీలించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం తమ విభాగంతోపాటుగా అన్నా వర్సిటీ, చెన్నై ఐఐటీ నిపుణుల సహకారంతో ఉన్నత స్థాయి కమిటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుత ఘటనపై సమగ్ర పరిశీలనతోపాటుగా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనల కొరడా ఝుళిపించే రీతిలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సీఎండీఏ వర్గాలు నివేదిక పంపించి ఉండటం గమనార్హం.
మరో ముప్పు : మౌళి వాకంలో ప్రైమ్ సృష్టి ట్రస్ట్ హైట్స్‌లోని మరో భవనం ముప్పు అంచున ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెలుగు చూసి ఉంది. తొలి భవనం కూలిన క్షణాల్లో రెండో భవనంలో కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. తొలుత రెస్క్యూఆపరేషన్‌కు ఈ భవనం ఆడ్డంకిగా మారింది. ఈ భవనం రూపంలో ఏ క్షణాన ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళనతోనే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎండీఏ నిపుణులు ఆ భవనాన్ని పరిశీలించి అది కూడా ముప్పు అంచున ఉన్నట్టు తేల్చారు. ఈ భవనానికి ఓ వైపున పునాదులు ఒక అడుగు కిందకు దిగి ఉండటం, కొన్ని చోట్ల పగుళ్లతో భవనం వాలినట్టు ఉండటాన్ని గుర్తించారు.
ఆ భవనం లోపలి భాగంలో పలు చోట్ల గోడలు పగిలి శిథిలాలు ఉండడంతో ఈ భవనం ముప్పు అంచున ఉన్నట్టు నిర్ధారించి ఉన్నారు. దీన్ని ఏమి చేయాలోనన్నది తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం సీఎండీఏ వర్గాలు ఎదురు చూపుల్లో ఉన్నారు. ఉన్నత స్థాయి కమిటీ కి ఆమోదం లభించిన మరుక్షణం పూర్తి స్థాయి పరిశీలనతో ఆ భవనాన్ని కూల్చడమా లేదా, మరేదేని మార్గాలు అన్వేషించడమా అన్నది తేల్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణానికి నమూనా, డిజైనింగ్ సిద్ధం చేసి సంస్థ బోగస్‌గా తేలింది. జాతీయ భవన నిర్మాణ డిజైనింగ్ కౌన్సిల్‌లో ఆ సంస్థకు కనీసం సభ్యతం కూడా లేనట్టు పరిశీలనలో తేలింది.
పరిసరవాసుల్లో ఆందోళన : అధికారులకు తమ గోడు పట్టనట్టుందని ట్రస్ట్ హైట్స్ భవనాల చుట్టూ ఉన్న నివాసాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి భవనం కూలిన క్షణాల్లో ఆ ప్రభావం పరిసరాల్లోని 30 ఇళ్ల మీద పడింది. పది ఇళ్ల వరకు పూర్తిగా దెబ్బ తినగా, మిగిలిన ఇళ్లు పాక్షింగా దెబ్బ తిన్నాయి. గోడలు పెద్ద ఎత్తున బీటలు వారి, పై కప్పులు అక్కడక్కడ కూలిపోవడంతో ఆందోళనలో పడ్డ అక్కడి కొన్ని కుటుంబాలు తమ బంధువుల ఇళ్లల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. మరి కొన్ని కుటుంబాల ఆందోళన వర్ణనాతీతం. తమ ఇళ్లలోకి వెళ్లి కనీసం దుస్తులు కూడా తీసుకోలేని పరిస్థితి. దీంతో ఆ పరిసరాల్లోని తెలిసిన వాళ్ల ఇళ్లల్లో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
తమ గోడును ఇంత వరకు ఏ అధికారీ పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రమాద బాధితులను ఆదుకుంటున్న తరహాలో తమను ఆదుకోవాలని, తమ ఇళ్లను పునర్నిర్మించేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, రెండో భవనం పరిసరాల్లో ఉన్న ఇళ్ల యాజమాన్యాల్లో, అద్దెకు ఉంటున్న కుటుంబాల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ భవనం రూపంలో ఎక్కడ తమకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ భవనానికి అనుకుని స్కూల్ సైతం ఉంది.
దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని దృష్ట్యా, ఆ పరిసర వాసులను ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా, తామెక్కడికి వెళ్లాలో, ఎక్కడ, ఎన్ని రోజులు తల దాచుకోవాలోనన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం తమకు ఆశ్రయం కల్పించే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని, అప్పొసప్పో చేసి ఇళ్లను నిర్మించు కుంటే, ఆ భవనం రూపంలో ముప్పు ఎదురవుతుండడం, ఇందులో అధికారుల తప్పులు సైతం ఉన్నాయంటూ ఆ పరిసర వాసులు ఏకరువు పెడుతున్నారు.