భద్రతకు భరోసా ఏదీ? | Chennai building collapse death toll rises to 18, 23 rescued | Sakshi
Sakshi News home page

భద్రతకు భరోసా ఏదీ?

Published Tue, Jul 1 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

భద్రతకు భరోసా ఏదీ?

భద్రతకు భరోసా ఏదీ?

 సాక్షి, చెన్నై: చెన్నై నగరంలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. చిన్న గది కూడా ఊహించ నంత రీతిలో అద్దె పలకడంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది.  దీంతో చిన్న చిన్న ఉద్యోగులు అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో తమ జీవితాలను సాగదీస్తున్నారు. ఇక, కడుపులు మాడ్చుకుని తమ సంపాదనలో కొంత భాగాన్ని భద్ర పరుచుకుంటూ సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. అప్పోసప్పో చేసి సొంత ఇంట్లో చేరిపోవాలన్న ఆశల పల్లకిలో పరుగులు తీసే వారూ ఉన్నారు. వీరందరినీ ఆకర్షించే విధంగా భవన నిర్మాణ సంస్థలు ముందుకు సాగుతున్నాయి. విస్తరణ: చెన్నై ఇటీవల మహానగరంగా విస్తరించింది. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు మహానగరం పరిధిలోకి చేరాయి. దీంతో నగర శివారుల మీద దృష్టి పెట్టే వారు అధికం అయ్యారు. శివారు ప్రాంతాల్లో మధ్య, ఉన్నత కుటుంబాల వారిని ఆకర్షించే అనేక రకాల నివాస గృహాల నిర్మాణాల మీద అనేక సంస్థలు దృష్టి పెట్టాయి.
 
  ఉన్నత వసతులు కలిగిన ఇళ్లను, వారికి తగిన రేట్లలో సమకూర్చే పనిలో పడ్డాయి. అడ్వాన్స్‌లను రాబట్టి నిర్మాణాల వేగం పెంచి నాణ్యతకు, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాయి. విచ్చలవిడిగా నిర్మాణాలు: నగర శివారులోని పోరూర్, కుండ్రత్తూరు, గూడువాంజేరి, వండలూరు, మన్నివాక్కం, మణి మంగళం, ఒరగడం, సింగ పెరుమాల్ కోవిల్, జీఎస్‌టీ రోడ్డు, ముడిచ్చూర్, తాంబరం పరిసరాలు, మేడవాక్కం పరిసరాలు, పళ్లికరనై, నీలాంగరై, ఓల్డ్ మహాబలిపురం మార్గాల్లో విచ్చలవిడిగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. ఓ వైపు ఐటీ సంస్థల నిర్మాణాలు, మరో వైపు ఇక్కడి ఉద్యోగులను ఆకర్షించే విధంగా విల్లాలు, డూప్లెక్స్‌లు నిర్మించేస్తున్నారు.  భరోసా కరువు: చెన్నైలో ఒకప్పుడు ఎల్‌ఐసీ భవనమే అతి పెద్దది. ఇప్పుడు ఆ దాన్ని మించిన అంతస్తులతో కూడిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి.
 
  ఈ బహుళ అంతస్తుల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న ప్రజలు అనేకం. ఇక నగర శివారుల్లో సాగుతున్న నిర్మాణాలు ప్రజల భద్రతకు భరోసా దక్కే రీతిలో ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకం అవుతోంది. నిబంధనలను, నాణ్యతను సక్రమంగా పాటిస్తున్నారా? అన్న ఆందోళన కొనుగోలుదారుల్లో బయలు దేరింది. నగర శివారులో 30 అంతస్తులతో కూడిన ఆరు అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాలు, 28 అంతస్తులతో కూడిన మరో ఆరు, 20 అంతస్తులతో కూడిన 8 భవనాలు నిర్మాణ ముగింపుదశలో ఉన్నారుు. 20 నుంచి 40 అంతస్తులతో కూడిన 32 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 59 బహుళ అంతస్తుల భవనాలు సీఎండీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ భవనాల నిర్మాణ పనులు లాంఛనంగా ఆరంభం అయ్యాయని చెప్పవచ్చు.
 
 నిబంధనలకు పాతర: భవనాలు నిర్మించే సమయంలో తూచా తప్పకుండా నిబంధనల్ని, నాణ్యతల్ని పాటించాల్సిన అవశ్యకత ఉంది. అతి పెద్ద బహుళ అంతస్తుల్ని నిర్మించే సమయంలో విపత్తుల్ని ఎదుర్కొనే రీతిలో నిర్మాణాలు సాగించాల్సి ఉన్నా, పాటించే వాళ్లు అరుదే. ఇందుకు గాను,  నగరాభివృద్ధి చట్టాల్లో ఉన్న పాత నిబంధనల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ విపత్తుల భద్రత పేరిట కొన్ని నిబంధనలను, కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గత ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నగరాభివృద్ధి చట్టాల్లో, నిబంధనల్లో సవరణలు తెచ్చే విధంగా చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అయితే, అమల్లో జాప్యం నెలకొంటోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తి మోహన్ కమిటీ నగరాభివృద్ధి చట్టంలో సవరణకు సూచనలు ఇచ్చింది. భవన నిర్మాణ నిబంధనలను కఠినతరం చేస్తూ సిఫారసులు చేసినా ఇంత వరకు అమల్లోకి రాలేదని చెప్పవచ్చు.
 
 సవరణలు సాగేనా?: విచ్చలవిడిగా బిల్డర్ల రాజ్యం సాగుతుండడం, నిబంధనలను తుంగలో తొక్కి భవన నిర్మాణాలు కుప్పలు కుప్పలుగా సాగుతుండడంతో ఇకనైనా చట్టాల్లో సవరణలు సాగేనా? అన్న ప్రశ్న బయలు దేరింది. మౌళి వాకం ఘటన కార్మికుల్ని బలిగొంది. అదే ఆ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ఉంటే, సొంతింటి కల సాకారం చేసుకున్న ఎన్నో కుటుంబాలు జీవచ్చవాలుగా మారి ఉండేవి. ఇప్పటికైనా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని భవన నిర్మాణ చట్టాల్ని కఠినతరం చేస్తూ సవరణలకు ప్రభుత్వం సిద్ధం అయ్యేనా అన్న ఎదురు చూపులు ప్రజల్లో పెరిగాయి.
 
 ఈ విషయంగా సీఎండీఏ అధికారి ఒకర్ని కదిలించగా, పాత నిబంధనలు కొన్ని భవన నిర్మాణ సంస్థలకు అస్త్రాలుగా మారుతున్నాయని, ఈ దృష్ట్యా, నిబంధనలను పక్కన పెట్టి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాయని వివరించారు. భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, నగరాభివృద్ధి చట్టాల్లో ఏడు అంశాల సవరణలకు చేసిన సిఫారసుల నివేదిక సిద్ధంగా ఉందన్నారు. పాలకుల నుంచి ఆదేశాలు వస్తే చాలు కొరడా ఝుళిపించడంతో పాటుగా బహుళ అంతస్తుల్లో నివాసాలు ఉండే ప్రజల భద్రతకు పూర్తి భరోసా దక్కే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement