విమానాశ్రయంలో పటిష్ట భద్రత కోసం..
చెన్నైః భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ చైన్నై విమానాశ్రయంలో బయోమెట్రిక్ యాక్సెస్, బ్యాడ్జింగ్ విధానాలను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ డైరక్టర్ దీపక్ శాస్త్రి తెలిపారు. ఈ విధానం ద్వారా మొత్తం విమానాశ్రయ సిబ్బందికి ప్రత్యేక అనుమతి లభించడంతోపాటు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించే అవకాశం లేకుండా ఉంటుందని ఆయన వివరించారు.
విమానాశ్రయంలో ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ల్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయంతో సిబ్బంది లోనికి ప్రవేశించేందుకు తనిఖీలు చేపడుతున్నారు. స్టాఫ్ ఐడీ కార్డును బట్టి వారు సిబ్బందిని లోనికి అనుమతిస్తున్నారు. అయితే ఇలా వ్యక్తిగత తనిఖీలకు బదులుగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల అనేక రకాలుగా ఉపయోగం ఉంటుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించడంతో ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వ్యక్తుల కళ్ళు, వేలి ముద్రల ఆధారంగా ఈ బయోమెట్రిక్ గుర్తింపును ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఐడీ కార్డుల వల్ల వ్యక్తులు, వాహనాల ప్రవేశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందుకే బయోమెట్రిక్ పద్ధతి అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు.
ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశించే ప్రతి ద్వారం, ప్రవేశం వద్దా బయోమెట్రిక్ మెషీన్ ను ఏర్పాటు చేస్తామని, సిస్టమ్ అనుమతించిన తర్వాతే వీరు లోపలికి వెళ్ళగల్గుతారని, వారి కార్డు ధృవీకరణ డేటాబేస్ సర్వర్ లో నమోదవుతుందని, దీనిద్వారా ఇతరులు ప్రవేశించే అవకాశం తగ్గి భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు అనేక సందర్భాల్లో బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బయోమెట్రిక్ సిస్టమ్ భద్రతకు మరింత సహకరించగలదని అధికారులు ఆశిస్తున్నారు.