మాల్స్‌లో నిఘా
కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్, థియేటర్లు, హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రద్దీ ప్రాంతాలపై తీవ్రవాదులు గురి పెట్టారన్న సంకేతాలున్నాయి. దీంతో శనివారం మాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో పోలీసులు చర్చించారు. చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను వివరించారు.
సాక్షి, చెన్నై: మహానగరంలో ఇటీవల మాల్స్, మల్టీప్లెక్స్‌ల సంస్కృతి పెరిగింది. ఓ వైపు షాపింగ్ మరో వైపు సినిమా స్క్రీన్స్ వీటిలో ఉండడంతో జనం అటు వైపుగానే మొగ్గు చూపుతున్నారు. నగరంలో, శివారుల్లో కూడా ఈ మాల్స్, మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జన సంచారం అత్యధికంగా ఇక్కడే ఉండడంతో, తీవ్ర వాదులు వాటిపై గురి పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు రోజుల క్రితం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌కు, శుక్రవారం సీబీఐ కార్యాలయానికి వచ్చిన బాంబు బెదిరింపులకు తోడుగా జన సంచారం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కుట్రలకు వ్యూహ రచన జరిగినట్టుగా నగర పోలీసు యంత్రాంగానికి సమాచారం అందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జన సంచారం అధికంగా ఉండే, అన్ని మాల్స్, మల్టీప్లెక్స్, థియేటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కమిషనర్ జార్జ్ ఆదేశాలు జారీ చేశారు.
నిఘా కట్టుదిట్టం : నగరంలోని అన్ని మాల్స్, మల్టీప్లెక్స్‌లలో, థియేటర్లలో ప్రస్తుతం కల్పించిన భద్రతను, అక్కడున్న ఏర్పాట్లను తెలుసుకునేందుకు పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఓ వైపు భద్రత కట్టుదిట్టానికి చర్యలు తీసుకుంటూనే, ఆయా మాల్స్, మల్టీప్లెక్స్‌ల ప్రతినిధులతో సమావేశానికి పిలుపునిచ్చింది. దీంతో మధ్యాహ్నం కమిషనరేట్‌లో అదనపు కమిషనర్ (దక్షిణం) అభయ్‌కుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఆయూ ప్రాంతాల్లో ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆరా తీశారు. ఇక మీదట చేపట్టాల్సిన భద్రతా చర్యలను వివరించారు. ప్రతి మాల్‌లోని అన్ని ప్రవేశ మార్గాల్లో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని, మెటల్ డిటెక్టర్ల సంఖ్యను పెంచాలని, ఆ పరిసరాల్లో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లోని దృశ్యాలు పరిశీలించాలని, 24 గంటల్లో నమోదైన దృశ్యాల్ని మరో మారు పరిశీలించి ఏదేని అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడం లేదా, పోలీసుల సాయం కోరేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మాల్స్‌లోని అన్ని దుకాణాల్లోను నిఘా నేత్రాలు తప్పని సరి అని, ప్రతి వినియోగ దారుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించాలని సూచించారు. పార్కింగ్ స్టాండ్లలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసినానంతరం లోనికి అనుమతించాలని ఆదేశించారు. తాము జరిపే తనిఖీల్లో ఏదేని భద్రతా లోపాలు ఉంటే సంబంధిత మాల్స్, థియేటర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నగరంలోని రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల ప్రతినిధులతో మంగళవారం సమావేశానికి నిర్ణయించారు.