చాయ్‌వాలాలే వీఐపీలు | Mumbai 'Chai Walas' are VIP guests in Narendra Modi's rally | Sakshi
Sakshi News home page

చాయ్‌వాలాలే వీఐపీలు

Published Fri, Dec 20 2013 12:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

Mumbai 'Chai Walas' are VIP guests in Narendra Modi's rally

ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొననున్న ఓ బహిరంగ సభలో నగరానికి చెందిన చాయ్‌వాలాలు వీఐపీలుగా హాజరుకానున్నారు. ఆదివారం నాడు జరగనున్న ఈ సభ కోసం నగరంలోని సుమారు పదివేల మంది చాయ్‌వాలాలకు బీజేపీ వీఐపీ పాస్‌లు జారీ చేసింది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో జరగనున్న ఈ సభకు దక్షిణ ముంబైలోని చాయ్ విక్రేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించామని బీజేపీ నాయకుడు రాజ్ పురోహిత్ గురువారం చెప్పారు. రాజకీయాల్లోకి రాకమునుపు నరేంద్ర మోడీ ఓ చాయ్‌వాలాగా తన జీవితాన్ని ప్రారంభించారని అన్నారు. నిరాడంబరమైన మోడీ జీవనశైలిని కాంగ్రెస్ ఎగతాళి చేసిందని, దేశాన్ని అమ్ముకోవడం కంటే చాయ్ విక్రయించడం ఎంతో మేలని పురోహిత్ పేర్కొన్నారు. అందుకే ఈ మెగా ర్యాలీలో టీ విక్రేతలే ప్రత్యేక అతిథులని చెప్పారు. వీఐపీ ఆహ్వానపత్రాలు అందుకున్న అనేకమంది టీ విక్రేతలు ఆదివారం నాడు తమ దుకాణాలు మూసేసి మహాగర్జన ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించారు. టీ విక్రేతల కోసం ఓ ప్రత్యేక ఆవరణ ఏర్పాటు చేస్తామని, అక్కడే వారు కూర్చొని మోడీ ప్రసంగం వింటారని పురోహిత్ చెప్పారు. నగరంలోని చాయ్‌వాలాలే కాకుండా ఈ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనాన్ని సమీకరించే ఏర్పాట్లలో బీజేపీ నగరశాఖ తలమునకలైంది.

 

 పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని పురోహిత్ చెప్పారు. సభను గూర్చి మీడియాలోని అన్ని వేదికల నుంచి ప్రచారం చేస్తున్నామని బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్ చెప్పారు. సభకు రావాలనుకునే వారి కోసం ఓ ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని, దానికి ‘మిస్’ కాల్ ఇస్తే చాలని, వారిని వాహనంలో సభకు తీసుకువెళతామని శేలార్ వివరించారు. మిస్ కాల్ అందిన వెంటనే తమ కార్యకర్త తిరిగి ఆ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారని చెప్పా రు. ఈ సభలో మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే, శాసనమండలిలో ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే ప్రసంగిస్తారని శేలార్ చెప్పారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్‌రూఢీ మూడు వారాలుగా ఇక్కడే తిష్టవేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement