న్యూఢిల్లీ: డబ్బావాలాలు... ఈ పేరు చెబితే ఎవరికైనా గుర్తుకొచ్చేది దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరమే. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ దాదాపు రెండు లక్షలమంది ఉద్యోగులకు భోజన బాక్సులను అందజేస్తారు. డబ్బావాలాలు క్రమశిక్షణకు మారుపేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో వీరిపై ఓ పాఠ్యాంశం కూడా ఉంది. బ్రిటన్ రాచకుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు సైతం వీరికి ఆహ్వానం లభించింది. ఈవిధంగా ప్రపంచమంతటా పేరుగాంచిన ముంబై డబ్బావాలాలు తమ ప్రాణాలకు బీమా భద్రత కల్పించుకునే అంశంపై దృష్టి సారించారు. అంతేకాకుండా వీధిబాలలకు కడుపు నింపే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముంబైలోని డబ్బావాలాల సంఖ్య ఐదువేలకుపైనే. ఇంటిదగ్గర వండిన భోజనాన్ని సకాలంలో అందించాలనే లక్ష్యంతో, క్రమశిక్షణతో పనిచేసే వీరంతా.. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని డబ్బావాలా ఫౌండేషన్ (డీఎఫ్)...ది హేపీ లైఫ్ వెల్ఫేర్ సొసైటీ సంస్థతో కలసి వైద్య బీమా సౌకర్యం కల్పిం చనుంది.
ఇందులోభాగంగా వారందరికీ బ్యాంకు ఖాతాలు, పాన్‌కార్డులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ విషయమై డబ్బావాలా ఫౌండేషన్ అధ్యక్షుడు దినకర్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘తమ వ్యాపార మెలకువలను నేర్చుకునేందుకు అనేకమంది యువకులు మా సంస్థలో చేరారు. ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. మా సిబ్బందికి బీమా వెసులుబాటు కల్పించాలనిగానీ లేదా పదవీ విరమణ తర్వాత పలు ప్రయోజనాలు కల్పించాలనిగానీ మేము ఏనాడూ అనుకోలేదు. అయితే ఇదొక అద్భుతమైన ఆలోచన అని అన్నారు. ‘సకాలంలో భోజనపు బాక్సులను చేరవేయాలనే తొందరపాటు ఒక్కొక్కసారి వారి ప్రాణాలపైకి తెస్తుంది. ఒక్కొక్కసారి సిగ్నళ్లను పట్టించుకోకుండా ముం దుకు సాగుతారు. అటువంటి సమయాల్లోనే వారు ప్రమాదాలకు గురవుతారు. మా వద్ద పనిచేసేవారిలో 85 శాతం మంది నిరక్షరాస్యులే. వారికి పలు ప్రయోజనాలు కల్పించాలనే ఆలోచన అత్యంత గొప్పది’ అని పేర్కొన్నారు.
ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం
డబ్బావాలాలకు ఇప్పటికే వైద్యసేవలతోపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తమ సంఘాన్ని 2012లో సంబంధిత కార్యాలయంలో నమోదు చేశామన్నారు. షేర్ మై డబ్బా పేరిట ఓ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఇందులోభాగంగా తమ ఖాతాదారులందరికీ ఎర్రస్టిక్కర్‌ను అందజేశామని, వారు భోజనం చేసిన తర్వాత అందులో ఇంకా ఏమైనా మిగిలింటే ఆ బాక్సులపై వీటిని అంటించాల్సి ఉం టుందన్నారు. ఆవిధంగా స్టిక్కర్లు అంటించిన బాక్సులను స్వచ్ఛంద సంస్థ చెందిన కార్యకర్తలకు అందజేస్తామన్నారు. అందులోని పదార్థాలను ఖాళీ చేసిన అనంతరం వారు ఆయా బాక్సులను తిరిగి తమకు ఇచ్చేస్తారన్నారు.
ప్రతి రోజూ 40 నుంచి 50 మంది చిన్నారులకు ఈ ఆహార పదార్థాలు అందుతున్నాయన్నారు. ఈవిధంగా చేయడం ఎంతో సంతృప్తి కలిగిస్తోందన్నారు. అయితే అనేకమంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని, క్రమేణా వారి ధోరణిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ ఖాతాదారుల వద్ద నెలకు రూ. 400 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నామన్నారు.
బీమా ధీమా
Published Thu, Dec 5 2013 6:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement