
ఉన్నతస్థాయికి చేరుకుంటా
కథానాయికగా ఎదగాలని చాలామంది కలలు కంటారు. అయితే ఆ కలల్ని నిజం చేసుకునేది కొందరే. 1990లో నటి సిమ్రాన్ సరిగ్గా అలాంటికలతోనే కోలీవుడ్ లో అడుగుపెట్టి హీరోయిన్‌గా తన సత్తా చాటుకున్నారు. 2000 సంవత్సరంలో తెరంగేట్రం చేసిన నయనతార ప్రముఖ నాయకిగా వెలుగొందుతున్నారు. ఇప్పుడీ తాజా అందాలతో తమిళ చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చారు నటి దీపా సన్నిధి. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ప్రాంతానికి చెందిన మోడల్ దీపా సన్నిధి. పాఠశాల రోజుల్లోనే అందాల పోటీలో పాల్గొన్న ఈ కన్నడ బ్యూటీ తన గురించి ఏమి చెబుతోందంటే... ఆభరణాల డిజైనింగ్ కోర్సు చేసిన నాకు కవితలు రాయడం అంటే ఆసక్తి. చదువుకునే రోజులోనే స్టేజీ అనుభవం గడించాను.
దీంతో సినిమాల్లో నటించడం సులభమైంది. తొలుత కన్నడంలో తెరకెక్కిన లూసియా చిత్రంలో నాయికగా నటించాను. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. అదే చిత్రం తమిళం రీమేక్ ఎన్నక్కుళ్ ఒరువన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాను. కన్నడ చిత్రంలో పోషించిన పాత్రనే ఇక్కడ పోషించాను. సిద్ధార్థ్‌తో కలసి నటించడం మంచి అనుభవం. తదుపరి యట్చన్ చిత్రంలో ఆర్యకు జంటగా నటిస్తున్నాను. ఆయన సెట్‌లో ఉంటే సందడే సందడి. ఆర్య అంత జోవియల్‌గా ఉంటారు. అంతేకాదు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈ చిత్రంతో మరో జంటగా నటిస్తున్న కృష్ణ స్వామితో కలిసి నటించడం తీయని అనుభవం.
ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కోలీవుడ్‌లో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇక్కడ మంచి కథలు, ప్రతిభావంతులైన దర్శకులు, చాలా మంది ఉన్నారు. కోలీవుడ్‌లో దక్కే గౌరవం ప్రపంచంలో ఎక్కడా లభించదు అని అంటోంది దీపా సన్నిధి.