
డీఎస్పీ కేసులో మిస్టరీ
►గణపతి మొబైల్, కంప్యూటర్,
►పెన్‌డ్రైవ్‌లలోని సాక్ష్యాలను చెరిపేశారు
►లీకైన ఫోరెన్సిక్ నివేదిక
►రాజకీయ, పోలీసు వర్గాల్లో కలకలం
బెంగళూరు: సుమారు ఏడాది కిందట మడికెరిలో డీఎస్పీ గణపతి అనుమానాస్పద మృతి కేసు తాజాగా మలుపు తిరిగింది. సీల్డ్ కవర్‌లో ఉండాల్సిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఎల్) గురువారం వెలుగు చూడటంతో విచారణపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్‌కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్పీ గణపతి ఉరివేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనమైంది. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగలేదని గణపతి కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేసు విచారణ దశలో ఉండగా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక బయటికి రావడం విశేషం. కేసు దర్యాప్తు సమయంలో గణపతికి చెందిన ఒక పెన్‌డ్రైవ్, ఫోన్, ల్యాప్‌టాప్, సర్వీస్ రివాల్వర్, తూటాలను సీఐడీ ఫోరెన్సిక్ విభాగానికి అందజేసింది. వీటిని పరిశీలించిన సీఎఫ్‌ఎల్... అందులో కొంత సమాచారం చెరిగిపోయిందని తన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంచనామా వీడియో రికార్డింగ్ నిబంధనల ప్రకారం జరగకపోవడం వల్ల కూడా కొన్ని సాక్ష్యాలు నాశనమయ్యాయని నివేదికలో పేర్కొంది.
ఏమిటీ కేసు?
2016 జూన్7న కొడగు జిల్లా మడికెరి నగరంలోని ఓ లాడ్జ్‌లో డీఎస్పీ గణపతి ఉరివేసుకుని మరణించిన స్థితిలో కనిపించారు. ఈ ఘటనకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏదేని విపరీత నిర్ణయం తీసుకున్నా, లేదా తనకు ఏమైనా జరిగినా అందుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, సీనియర్ ఐపీఎస్ అధికారులైన ప్రణవ్ మొహంతి, ఎ.ఎం ప్రసాద్‌లు కారణమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడైన నేహాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఇదే సందర్భంలో విమర్శలు వెల్లువెత్తడంతో కే.జే జార్జ్‌తో రాజీనామ చేయించిన సీఎం సిద్ధరామయ్య కేసును సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే గణపతి మరణానికి– జార్జ్, ఇతర అధికారులకు సంబంధం లేదని తేలిందని సీఐడీ రిపోర్టును అందజేయడంతో జార్జ్‌కి మళ్లీ నగరాభివృద్ధి మంత్రి పదవి దక్కింది.
జవాబు లేని ప్రశ్నలు
►ఈ కేసులో ఒక సాక్షితో కొందరు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. వారెవరు?
►గది సీలింగ్‌కు ఉరి వేసుకున్న స్థితిలో గణపతి కనిపించారు. అయితే మూడు రౌండ్ల కాల్పులు ఆ గదిలో ఎందుకు జరిగాయి. ఈ దిశగా సీఐడీ ఎందుకు దర్యాప్తు చేయలేదు.
►గణపతి యూనిఫామ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ఆయన పోలీస్‌లు ధరించే బెల్ట్ ఎందుకు ధరించలేదు?
►గణపతి ఉన్న గది తలుపులు లోపల బోల్టు వేసి ఉండలేదు. ఆత్మహత్యే చేసుకునే వ్యక్తి ఎవరైనా గడియ పెట్టి ఆ పనికి పాల్పడుతారు.
ఏయే విషయాలు చెరిగిపోయాయంటే...
►31 ఫోన్ కాల్స్ రికార్డ్స్
►52 ఎస్‌ఎమ్మెస్‌లు
►352 మొబైల్ నంబర్లు
►కంప్యూటర్‌లో ఉన్న 100 ఈమెయిల్స్
►185 ఫైల్స్ ఉన్న 8 జీబీ ఫోల్డర్
►ఒక పెన్‌డ్రైవ్‌లోని మ్తొతం 145 ఫీడీఎఫ్
ఫైల్స్, 2500 ఫొటోలు, 910 ఎక్స్‌ఎల్
ఫైల్స్, 31 పవర్ పాయింట్ ఫైల్స్,
791 టెక్స్ట్ ఫైళ్లు.