మౌనంగా రంగస్వామి!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం రంగస్వామి మౌనం ఎన్‌ఆర్ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను రేపింది. నామినేషన్‌కు శుక్రవారం ఒక్క రోజే సమయం ఉండడంతో సీటు ఆశిస్తున్న వారు సందిగ్ధంలో పడ్డారు. గురువారం అయినా, జాబితా విడుదల అయ్యేనా అన్న ఎదురు చూపుల్లో పడ్డారు. పుదుచ్చేరి కాంగ్రెస్‌ను చీల్చి ఎన్‌ఆర్ కాంగ్రెస్‌ను రంగస్వామి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2011 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆవిర్భవించిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ తన సత్తాను చాటుకుంది. అన్నాడీఎంకేతో కలిసి పయనం సాగించి ముప్పై నియోజకర్గాల్ని కల్గిన పుదుచ్చేరిలో అధికార పగ్గాల్ని రంగస్వామి చేపట్టారు.
అయితే, తమకు కావాల్సిన మెజారిటీ రావడంతో అన్నాడీఎంకేను పక్కన పడేశారు. ఇప్పుడు అదే ఆయన్ను వెంటాడుతున్నది. అన్నాడీఎంకే హ్యాండివ్వడంతో, బీజేపీతో కలసి పయనం సాగించేందుకు నిర్ణయించి వెనక్కు తగ్గారు. చివరకు ప్రజాసంక్షేమ కూటమి అని ఆలోచించి మనస్సు మార్చుకున్నారు.ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రంగస్వామికి తప్పలేదు. ఇన్నాళ్లు పొత్తు ప్రయత్నాలకే సమయాన్ని ఎక్కువగా రంగస్వామి వెచ్చించడంతో ప్రచార ఆర్భాటాలు, అభ్యర్థుల ఎంపిక ఎక్కడ వేసిన గంగొళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఇక్కడ ఓట్ల వేటలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, బీజేపీ కూటమిలు దూసుకెళుతుంటే, ఇంత వరకు అభ్యర్థుల జాబితా వెలువడక పోవడంతో ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇక, గురువారం కూడా జాబితా వెలువడని పక్షంలో రంగస్వామి నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఉత్సాహంగా అందరి కన్నా ముందుగా ఎన్నికల్లో దూసుకెళ్లిన రంగస్వామి , ఈ సారి మౌనంగా ఉండడంతో పుదుచ్చేరి రాాజకీయాల్లో చర్చ బయలు దేరింది. అయితే, రంగస్వామి మౌనం వెనుక కారణాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి పదవుల కోసం తనను ఉక్కిరి బిక్కిరి చేసిన వాళ్లు, మళ్లీ సీటు ఆశిస్తుండడం, మంత్రులు కొందరు మళ్లీ రేసులో దిగేందుకు సిద్ధ పడటం వెరసి రంగస్వామి ఆచీతూచీ అడుగులు వేయడానికి సిద్ధమయ్యార ని చెబుతున్నారు.
పలువురు మాజీలకు సీట్లు ఇవ్వకూడదని రంగస్వామి నిర్ణయించి ఉన్నారని, అలాగే,మరి కొందరికి చెక్ పెట్టే విధంగా, సరికొత్త అభ్యర్థులతో రేసులో దిగేందుకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారని చెబుతున్నారు. అయితే, మాజీలకు సీట్లు నిరాకరించ బడ్డ పక్షంలో ఎన్నికల వేళ చివరిక్షణంలో ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రకంపనలు బయలు దేరుతాయో అన్నది వేచి చూడాల్సిందే.