
ఆయన రాజీనామాపై సీఎం విస్మయం
న్యూఢిల్లీ: ఢిల్లీ లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 'జంగ్ రాజీనామా వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నా' అంటూ కేజ్రీవాల్ ట్విట్ చేశారు. నజీబ్ జంగ్ గురువారం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా నజీబ్ జంగ్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోలేదని, కొద్ది నెలల క్రితమే ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెప్ట్‌నెంట్ గవర్నర్ జంగ్ మధ్య విరోధం కొనసాగింది. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే జంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో ఏడాదిన్నర పదవీ కాలం ఉండగానే నజీబ్ జంగ్ రాజీనామా చేయడం గమనార్హం. అయితే కుటుంబంతో సమయాన్ని వెచ్చించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, రాజీనామా విషయం జంగ్ వ్యక్తిగత నిర్ణయంమని ఆయన ఓఎస్డీ తెలిపారు.
రాజీనామా అనంతరం జంగ్... ఏడాదిపాటు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ప్రజలంతా తనకు ఎంతో సహకరించారని, దాంతో పాలనకు అడ్డంకులు ఎదురు కాలేదని, తనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిన ప్రజలతో పాటు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు. గతంలో ఆయన జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ చాన్సులర్‌గా పని చేశారు. రాజీనామా నేపథ్యంలో నజీబ్ జంగ్ తిరిగి తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని చేపట్టనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Sh Jung's resignation is a surprise to me. My best wishes in all his future endeavours.
— Arvind Kejriwal (@ArvindKejriwal) 22 December 2016