Delhi lieutenant governor
-
‘మహిళా సమ్మాన్’పై దర్యాప్తు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా సమ్మాన్ యోజన పేరుతో మహిళల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ వ్యక్తులు సేకరించడంపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులను శనివారం ఆదేశించారు. పథకంపై ఎన్నికల సమయంలో ప్రచారం జరుగుతున్న తీరును ఎలక్టోరల్ అధికారి ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆయన ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. కాంగ్రెస్ నేత, న్యూఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బుధవారం స్వయంగా తనకు చేసిన ఫిర్యాదుపై ఎల్జీ సక్సేనా ఈ మేరకు స్పందించారు. మహిళలకు ఆశ చూపి వ్యక్తిగత వివరాలను సేకరిస్తూ వారి గోప్యతకు భంగం కలిగించే వారెవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఎల్జీ పోలీస్ కమిషనర్‌కు సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్ల వద్ద పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్లు ఆరోపణలున్నాయని ఎల్జీ పేర్కొన్నారు. దీంతోపాటు, ఢిల్లీ ఎన్నికల్లో పంచేందుకు పంజాబ్ నుంచి డబ్బులు అందుతున్నాయన్నారు. మహిళా సమ్మాన్ యోజన కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆప్ ప్రభుత్వం అందజేస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆప్ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి మహిళల వివరాలను సేకరిస్తూ దరఖాస్తులను పూర్తి చేయిస్తున్నారు. అయితే, బయటి వ్యక్తులు వచ్చి అందజేసే దరఖాస్తులను నింపొద్దంటూ గత వారం మహిళా శిశు అభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ పథకం అమలు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తామని స్పష్టతనిచ్చింది. ఆప్‌ను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: కేజ్రీవాల్ మహిళా సమ్మాన్పై దర్యాప్తు జరపాలన్న ఢిల్లీ ఎల్జీ ఆదేశాలపై ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఉత్తర్వులు ఎల్జీ కార్యాలయం నుంచి కాదు, అమిత్ షా నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆప్ పథకాలను అడ్డుకునేందుకే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయంటూ నిప్పులు చెరిగారు. నేరుగా చర్యలు తీసుకునే ధైర్యం లేని బీజేపీ, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌తో ఫిర్యాదు చేయించిందని ఆరోపించారు. ‘ఎన్నికల్లో గెలిచాక మేమిచ్చే పథకాలతో లక్షలాది మంది మహిళలకు నెలకు రూ.2,100, వృద్ధులకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకాలను చూసి బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిస్తే తమ సంక్షేమ పథకాలన్నిటినీ నిలిపివేస్తుంది, అరాచకం రాజ్యమేలుతుందన్నారు. ‘ఎన్నికల్లో గెలిస్తే అమలు చేస్తామని ప్రకటించాం. ఇందులో విచారించడానికేముంటుంది? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ గూండాలు, పోలీసులు కలిసి పథకాల నమోదు శిబిరాలు జరక్కుండా అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్‌పై నమ్మకముంచాలని, పథకాల కోసం పేర్లు నమోదు చేసుకోవాలని ఢిల్లీ ప్రజలను ఆయన కోరారు. -
కేజ్రివాల్ కంటే ఆతిశి నయం
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాక అరవింద్ కేజ్రివాల్ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎల్జీ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్ మూతపడుతుంది. కమిషన్ ప్యానెల్లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా కమిషన్ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని ‘ఎక్స్’ వేదికగా ఉన్నారు.LG साहब ने DCW के सारे कॉंट्रैक्ट स्टाफ को हटाने का एक तुग़लकी फ़रमान जारी किया है। आज महिला आयोग में कुल 90 स्टाफ है जिसमें सिर्फ़ 8 लोग सरकार द्वारा दिये गये हैं, बाक़ी सब 3 - 3 महीने के कॉंट्रैक्ट पे हैं। अगर सब कॉंट्रैक्ट स्टाफ हटा दिया जाएगा, तो महिला आयोग पे ताला लग जाएगा।…— Swati Maliwal (@SwatiJaiHind) May 2, 2024ఢిల్లీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. తాజా చర్యలతో మరోసారి ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. -
‘ప్లీజ్ మోదీజీ ఢిల్లీ బడ్జెట్ ఆపొద్దు’.. మోదీకి కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఢిల్లీ బడ్జెట్ విషయంలో రెండు వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా రాజకీయ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. దయచేసి ఢిల్లీ బడ్జెట్‌ను ఆపవద్దని లేఖలో కోరారు. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో రాష్ట్ర బడ్జెన్‌ను కేంద్రం అడ్డుకోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ ప్రజల పట్ల మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌ను ఆమోదించమని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీలో నేడు(మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం అడ్డుకోవడంతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. ‘ఈ రోజు నుంచి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, టీచర్లకు జీతాలు అందవు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న గూండాయిజం’ అని ఆరోపించారు. కాగా బడ్జెట్లో ప్రకటనలకు అధిక కేటాయింపులు, మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ నిధులు కేటాయించడంపై ఆప్ ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. వీటికి సమాధానం చెబుతూ బడ్జెట్ ప్రతులను మళ్లీ పంపాలని మార్చి 17నే లేఖ రాసినట్లు పేర్కొంది. నాలుగు రోజులుగా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం.. అయితే ప్రకటనలపై కేటాయింపులు పెంచలేదని, గతేడాది మాదిరిగానే ఉందని పేర్కొంది. మొత్తం రూ.78,800 కోట్ల బడ్జెట్లో మౌలిక సదుపాయాల కోసం 22,000 కోట్లు, ప్రకటనల కోసం రూ. 550 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. అయితే హోంశాఖ లేఖను ఢిల్లీ చీఫ్ సెక్రటరీ మూడు రోజులు దాచిపెట్టారని మనీష్ సిసోడియా అరెస్ట్ అనంతరం ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కైలాశ్ గెహ్లోత్ ఆరోపించారు. ఈ విషయం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలిసిందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు తనకు బడ్జెట్ ప్రతిపాదన ఫైల్ అందిందని, రాత్రి 9 గంటలలకు హోం మంత్రిత్వ శాఖ ఆందోళనలకు స్పందించి ఫైల్‌ను తిరిగి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సమర్పించానని చెప్పారు. ఢిల్లీ బడ్జెట్‌ను ఆలస్యం చేయడంలో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి పాత్రపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ బడ్జెట్ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద నిలిచిపోయింది. -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
ఇళ్లు, ఆఫీసుల్లో ధర్నాలేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ అధికారంతో ఆప్ ప్రభుత్వం ఈ ధర్నా చేపట్టిందని ప్రశ్నించింది. ధర్నాను ఆపడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వనప్పటికీ.. ఇతరుల ఇళ్లు, కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం సరికాదని మండిపడింది. కేజ్రీవాల్ నిరసన, ఢిల్లీ ప్రభుత్వంపై ఐఏఎస్‌లు సమ్మె చేయడంపై దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఏకే చావ్లా, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ధర్నా చేసే అధికారం ఎవరిచ్చారు. ఎల్జీ కార్యాలయంలో బైఠాయిస్తారా? ఇది ధర్నా అయితే.. కార్యాలయం బయట చేసుకోండి. ఒకరి కార్యాలయం, నివాసంలో ధర్నా చేసే అధికారం మీకు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారులు విధుల్లో చేరేలా ఆదేశించడంతోపాటు.. పనులను అడ్డుకుంటున్న వారిపై ఎల్జీ అనిల్ బైజాల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 11 నుంచి ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసన రాజ్యాంగ హక్కు! ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సుధీర్ నంద్రాజోగ్ వాదిస్తూ.. సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హోదాలో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్‌లు నిరసన చేపట్టారన్నారు. ఇది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. విధులకు దూరంగా ఉంటున్న ఐఏఎస్ అధికారులు రోజూవారి మంత్రుల సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే, ఐఏఎస్ అధికారులు సమ్మె చేయడం లేదని.. కేజ్రీవాల్, అతని మంత్రులు వెంటనే ఎల్జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వ విపక్ష నేత విజేందర్ గుప్తా కూడా కేజ్రీవాల్ తీరును నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఐఏఎస్‌లు తిరిగి విధులకు వచ్చేలా ఎల్జీని ఆదేశించాలని ఆయన కోరారు. అలాగైతే చర్చలకు ఓకే.. అధికారులకు రక్షణ కల్పిస్తామంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారులు స్వాగతించారు. ఈ విషయంపై సీఎంతో చర్చించేందుకు సిద్ధమేనని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ రక్షణ, గౌరవాన్ని కాపాడే అంశాలపై నిర్దిష్టమైన చర్యలుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఇంతకుముందు లాగే చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యే ఒకరు సీఎం సమక్షంలోనే దాడికి దిగిన నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆప్ పార్టీ కూడా భద్రతపై సీఎం భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు విధులకు హాజరు కావాలని కోరింది. ఆసుపత్రికి సిసోడియా కేజ్రీకి మద్దతుగా జూన్ 13 నుంచి నిరాహార దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అస్వస్థతకు గురవడంతో ఆయనను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేజ్రీ ట్విట్టర్లో వెల్లడించారు. అనంతరం సిసోడియా ట్వీట్ చేస్తూ.. ‘మా అధికారులతో చర్చలు జరిపేందుకు సంతోషంగా అంగీకరిస్తున్నాం. వీరికి సరైన భద్రత కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ బాధ్యత ఎల్జీ చేతుల్లో ఉంది’ అని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్నా చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా, జైన్ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కేజ్రీవాల్ ఫోన్ చేశారు. దీనిపై ఉద్ధవ్ స్పందిస్తూ.. ‘ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకునే పరిస్థితి కల్పించాలి. ప్రతి అడుగులో అడ్డంకిగా మారొద్దు’ అని కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శించారు. -
ఢిల్లీలో మమతా, చంద్రబాబులకు షాక్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో షాక్ తగిలింది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలవాలని నిర్ణయించుకున్న మమతా బెనర్జీకి, చంద్రబాబునాయుడికి ఎల్జీ షాకిచ్చారు. ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్‌ను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు. రేపు ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశం కోసం మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లారు. అయితే ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తుందంటూ.. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో ఎల్జీ అనిల్ బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ నిరసనకు దిగిన కేజ్రీవాల్, మంత్రులను రేపు ఉదయం 8 గంటలకు కలిసి వారికి మద్దతు తెలుపాలనుకున్నారు. కానీ వీరి వ్యూహానికి చెక్ పడింది. ఎల్జీ ఆదేశాలపై స్పందించిన కేజ్రీవాల్.. ఎల్జీ ఈ నిర్ణయాన్ని తాను సొంతంగా తీసుకున్నారని అనుకోవడం లేదని, పీఎంఓనే అనుమతి నిరాకరించాలని ఎల్జీని ఆదేశించి ఉంటుందని ట్వీట్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఐఏఎస్‌ల నిరసన మాదిరేనని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై మరింత విమర్శలకు దిగిన కేజ్రీవాల్.. ప్రజాస్వామ్యంలో తాము నివసిస్తున్నామని, ఒక రాష్ట్ర సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలువడానికి ప్రధానమంత్రి అనుమతి నిరాకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. రాజ్ నివాస్ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఇది దేశ ప్రజలకు చెందిందన్నారు. మమతా బెనర్జీకి, చంద్రబాబునాయుడికి అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా దీనిపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ సీఎంను కలవడాన్ని పీఎంఓ ఎలా ఆపుతుంది. ఇది ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీగా అభిర్ణించారు. ఈ వారం ప్రారంభంలోనే కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపిన మమతా బెనర్జీ, వెంటనే కేంద్రం సమస్యను పరిష్కరించాలని కోరారు. I don’t think Hon’ble LG can take such a decision on his own. Obviously, PMO has directed him to refuse permission. Just like IAS strike is being done at PMO’s instance. https://t.co/hKEe99s8Fp — Arvind Kejriwal (@ArvindKejriwal) June 16, 2018 We live in a democracy. Can PM deny Hon’ble CMs of other states to meet CM of another state? Raj Niwas is noone’s personal property. It belongs to the people of India. https://t.co/bB0w9OeDrV — Arvind Kejriwal (@ArvindKejriwal) June 16, 2018 How can PMO stop Hon Chief Ministers of other states to meet CM Delhi. Is this undeclared emergency in Delhi? https://t.co/grKm1XwToU — Manish Sisodia (@msisodia) June 16, 2018 -
మోదీతో నజీబ్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి గురువారం రాజీనామా చేసిన నజీబ్‌జంగ్ శుక్రవారం ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని కార్యాలయంలో గంటపాటు గడిపారు. తనకు ఇన్నాళ్లు సహాయ సహకారాలు అందించిన మోదీకి నజీబ్ కృతజ్ఞతలు తెలిపడానికే ప్రధానిని కలిసినట్లు పీఎంవో వర్గాలు చెప్పాయి. తాను ఓ పుస్తకాన్ని రాస్తున్నట్లు మోదీతో నజీబ్ చెప్పార న్నాయి. నజీబ్‌కు మోదీతో ఉన్న సంబంధాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నజీబ్ల భేటీ చర్చనీయాంశమైంది. సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం నజీబ్‌జంగ్‌ను రాజ్‌నివాస్‌లో కలిశారు. నజీబ్ తనను అల్పాహారానికి పిలిచినట్లు కేజ్రీవాల్ చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే నజీబ్ రాజీనామా చేశారని, ఇందులో రాజకీయ అంశమేమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. -
ఇకనైనా ‘జంగ్’ ఆగుతుందా?
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంతో పోరాడుతూ తరచు వార్తల్లోకెక్కిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ హఠాత్తుగా పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమకు ఈ సంగతి ముందు తెలియదని వైరి పక్షాలు ఆప్, బీజేపీ రెండూ చెబుతున్నాయి. నజీబ్‌ను ఆప్ ప్రభుత్వమూ, పార్టీ ‘కేంద్రం ఏజెంట్’గానే చూశాయి. ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడు గడుగునా ఆయన అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించాయి. ఒకటి రెండు సందర్భాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్, నజీబ్ జంగ్ కరచాలనాలు చేసుకున్నా, చిరునవ్వులు చిందించుకున్నా అవి అక్కడితో ముగిసిపోయేవి. కొట్లాటలే నిరంతరం సాగేవి. మన దేశంలో గవర్నర్ పదవి స్వభావమే అటువంటిది. రాజ్యాంగం ఏం చెప్పినా, పార్టీల అభిప్రాయాలు ఏమైనా... కేంద్రంలోని పాలకపక్షానికి భిన్నమైన పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంటే ఇలాంటి కీచులాటలు నిత్యకృత్య మవుతున్నాయి. అక్కడా, ఇక్కడా ఒకే పార్టీ అధికారంలో ఉన్నా... వేర్వేరు పార్టీలైన పక్షంలో సుహృద్భావ సంబంధాలున్నా ఈ గొడవలుండవు. కనుక గవర్నర్‌కూ, ఒక రాష్ట్ర సీఎంకూ వైషమ్యాలు ఎందుకొస్తాయో సులభంగా అర్ధమవుతుంది. అంతకు ముందు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించినవారు లేకపోలేదుగానీ... దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి ఆ పదవే ఉండరాదని గట్టిగా డిమాండ్ చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. సీఎంగా ఉండి విదేశాలకు వెళ్లినప్పుడు తనను బర్తరఫ్ చేయడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. విపక్షాలతో కలిసి ఉద్యమించి తన పదవిని తిరిగి కైవసం చేసుకున్నారు. రాజకీయాలతో సంబంధంలేనివారిని గవర్నర్లుగా నియమించాలని చాన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు సూచించింది. మన దేశంలో ఎన్నికల్లో ఓడిన నేతలకూ, ఎన్నికల్లో నెగ్గలేని నేతలకూ గవర్నర్ పదవులు పునరావాస కేంద్రాలుగా మారా యని కటువుగా వ్యాఖ్యానించింది. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కా రియా కమిషన్ సైతం గవర్నర్ పదవికి ఎంపికయ్యేవారు రాజకీయాలకు సంబంధం లేనివారైతే మంచిదని అభిప్రాయపడింది. ఏదో ఒక రంగంలో నిష్ణాతులైన తటస్థ వ్యక్తులను ఎంపిక చేస్తే ఆ పదవికుండే ఔన్నత్యం నిల బడుతుందని చెప్పింది. యూపీఏ సర్కారు నియమించిన వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. ఎవరు ఏం చెప్పినా గవర్నర్ల నియామకం తీరు మారలేదు. విపక్షంలో ఉండి నీతులు చెప్పినవారు అధికార పీఠం ఎక్కగానే తామూ అదే పని చేయడానికి వెరవడం లేదు. బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టు, సర్కారియా, వీరప్పమొయిలీ కమిషన్ల అభిప్రాయాలు పట్టించుకోవాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరేవారు. తాము అధికారంలో కొచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించారు. గవర్నర్ పదవుల్లో ఉన్నవారిని తప్పించి ఆ స్థానాల్లో తమవారిని నియమించుకున్నారు. యూపీఏ సర్కారు తొలిసారి 2004లో అధికారంలోకొచ్చినప్పుడు కూడా ఇలాగే చేసింది. సర్వం రాజకీయమయం అయినచోట ‘తటస్థ’ వ్యక్తులుంటారనుకోవడం అమాయకత్వమైనా కావాలి. లౌక్య మన్నా కావాలి. ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పుకుంటుంటే, ఐఏఎస్ అధికారిగా బాధ్యతల్లో తలమునకలై ఉంటే, సమాజసేవలో తరిస్తుంటే... అలాంటివారంతా అన్నిటికీ అతీతంగా ఉంటారనుకోవడం ఉత్త భ్రమ. అందుకు నజీబ్‌జంగే పెద్ద ఉదాహరణ. ఆయన మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా, కేంద్రంలో జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. ఢిల్లీలోని జమియా మిలియా ఇస్లామియా యూని వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా వ్యవహరించారు. అప్పటి యూపీఏ సర్కారు నజీబ్ జంగ్‌ను ఏరికోరి గవర్నర్ పదవికి ఎంపిక చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గవర్నర్‌గా నియమించిన జ్యోతి రాజ్‌ఖోవా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్ని డ్రామాలకు తెరలేపారో అందరికీ తెలుసు. చివరకు ఎన్డీఏ ప్రభుత్వమే ఆయన్ను తప్పు కోమని చెప్పినా రాజ్‌ఖోవా మొండికేశారు. మొన్న అక్టోబర్‌లో ఆయనకు ఉద్వాసన చెప్పాల్సివచ్చింది. రాజ్‌ఖోవా అసోంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు. కనుక స్వభావ రీత్యా గవర్నర్ పదవి ‘అవసరమైతే’ జగడానికి సిద్ధంగా ఉండేవారికి మాత్రమే సరిపోతుంది. తాను దేనికైనా సిద్ధమేనని ఈ మూడేళ్ల కాలంలో నజీబ్ జంగ్ రుజువు చేశారు. 2014 ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు తీసుకొచ్చినప్పుడు వారిరువురి మధ్యా మొదలైన వివాదం తర్వాత విస్తరిస్తూ పోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పది రోజులు సెలవులో వెళ్లినప్పుడు ఆయన స్థానంలో నియ మించాల్సిన అధికారిపై సైతం ఇద్దరి మధ్యా కీచులాటలు సాగాయి. నిజాయి తీపరుడిగా పేరున్న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ఎస్టేట్ ఆఫీసర్‌ను మొన్న మే నెలలో దుండగులు కాల్చిచంపాక జంగ్‌పై ఆప్ సర్కారు నిప్పులు చెరిగింది. ఖాన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులందితే చర్య తీసుకోమంటూ అంతక్రితం జంగ్ ఆదేశాలివ్వడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఈ ఫిర్యాదీదారుల్లో ఒకరు. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరే పాలనాధికారని, ఇతరచోట్లలా ఆయన రాష్ట్ర కేబినెట్ చెప్పినట్టు వ్యవహరించనవసరం లేదని మొన్న ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పాక జంగ్, కేజ్రీవాల్ మధ్య మరింత దూరం పెరిగింది. ఇంత కొరకరాని కొయ్యగా ఉన్నా జంగ్ 18 నెలల ముందే ఎందుకు తప్పుకోవా ల్సివచ్చింది? ఇది తన వ్యక్తిగతమైన నిర్ణయమని జంగ్ చెబుతున్నా అప్పుడే రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఆప్ ప్రభుత్వంతో ఇంతకంటే ‘కఠినంగా’ వ్యవహరించగలిగినవారిని కేంద్రం నియమించదల్చుకున్నదని కొందరంటున్నారు. అదే నిజమైతే నజీబ్ జంగ్ నిష్క్రమించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జంగ్ (యుద్ధం) ఆగదని అర్థమవుతోంది. ఇలాంటి వివాదాలు వ్యవస్థల్ని పలచన చేస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి అవరోధాలవుతాయి. ఈ మాదిరి అప్రజాస్వామిక ధోరణులకు ఎంత త్వరగా స్వస్తి చెబితే అంత మంచిది. -
ఆయన రాజీనామాపై సీఎం విస్మయం
న్యూఢిల్లీ: ఢిల్లీ లెప్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 'జంగ్ రాజీనామా వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నా' అంటూ కేజ్రీవాల్ ట్విట్ చేశారు. నజీబ్ జంగ్ గురువారం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా నజీబ్ జంగ్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోలేదని, కొద్ది నెలల క్రితమే ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెప్ట్నెంట్ గవర్నర్ జంగ్ మధ్య విరోధం కొనసాగింది. వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే జంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో ఏడాదిన్నర పదవీ కాలం ఉండగానే నజీబ్ జంగ్ రాజీనామా చేయడం గమనార్హం. అయితే కుటుంబంతో సమయాన్ని వెచ్చించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, రాజీనామా విషయం జంగ్ వ్యక్తిగత నిర్ణయంమని ఆయన ఓఎస్డీ తెలిపారు. రాజీనామా అనంతరం జంగ్... ఏడాదిపాటు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ప్రజలంతా తనకు ఎంతో సహకరించారని, దాంతో పాలనకు అడ్డంకులు ఎదురు కాలేదని, తనపై అపారమైన ప్రేమాభిమానాలు చూపిన ప్రజలతో పాటు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు. గతంలో ఆయన జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ చాన్సులర్‌గా పని చేశారు. రాజీనామా నేపథ్యంలో నజీబ్ జంగ్ తిరిగి తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని చేపట్టనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. Sh Jung's resignation is a surprise to me. My best wishes in all his future endeavours. — Arvind Kejriwal (@ArvindKejriwal) 22 December 2016 -
గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామా
-
గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. 2013లో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నజీబ్ జంగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నజీబ్ జంగ్ మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 18 నెలలు ముందుగానే జంగ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే తనకు సహకరించిన కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా నజీబ్ జంగ్ తిరిగి తనకు ఇష్టమైన అధ్యాపక వృత్తిలోకి వెళ్లనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు హఠాత్తుగా గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై నజీబ్ జంగ్ ఎటువంటి కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇక ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల మధ్య మొదటి నుంచీ సామరస్యత లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్న విషయం తెలిసిందే. -
నజీబ్ జంగ్ 420: స్వామి
న్యూఢిల్లీ: పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై విరుచుకుపడ్డారు. జంగ్ వంచకుడని, లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి ఉన్నత పదవికి ఆయన సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా అభిప్రాయం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జంగ్ అనర్హుడు. కేజ్రీవాల్ మాదిరిగా ఆయన మరో 420. జంగ్ స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముంద’ని సుబ్రహ్మణ స్వామి ట్వీట్ చేశారు. ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన స్వామి ఇంతకుముందు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని, పార్టీ పెద్దల జోక్యంతో ఆయన వెనక్కు తగ్గారు. In my opinion, this LG of Delhi Mr. Jung is unsuited for this high post. He is another 420 like Kejri. We need a Sangh person in Delhi — Subramanian Swamy (@Swamy39) 30 August 2016 -
ఆ నివేదిక కూడా గోప్యమేనా?!
విశ్లేషణ ఢిల్లీలో శాసనసభను రద్దు చేయాలని ఎల్జీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు ఏ రక్షణా లేదు. అంతే గాకుండా గవర్నర్‌కు ఉన్న రక్షణ నియమాలను రాజ్యాంగంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించలేదు. దేశభద్రత వంటి కీలకమైన అంశాల్లో తప్ప ప్రభుత్వాలు పాలనా రహస్యాలు అంటూ సమాచారం చెప్పకుండా దాచడానికి ప్రస్తుతం వీల్లేదు. సర్కారీ పెద్దల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పాలనకు సంబంధించినైవైతే బయట పెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం వాటిని దాచడానికి వీలుగా ప్రివిలేజిని వాడుకోవడానికి సాక్ష్య చట్టం సెక్షన్ 123 అనుమతించేది. దీనిపైన చాలా వాద వివాదాలు చెలరేగాయి. ఎన్నో కోర్టు తీర్పులు ప్రివిలేజి విస్తారాన్ని తగ్గించాయి. రాష్ర్టపతి ఉత్తర్వులు, గవ ర్నర్ నివేదికలు, ప్రధాన న్యాయమూర్తికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన లేఖాయణం ఇవన్నీ ఒకప్పుడు మూడో కంటికి తెలియడానికి వీల్లేని పాలనా వ్యవహరాలనీ, కనుక వీటిని బయట పెట్టడానికి వీల్లేదని సూత్రీకరించారు. సార్వభౌమాధికారం ఉన్న కార్యపీఠాలు తమ వ్యవహారాల గురించి చెప్పితీరాలని అడిగే అధికారం కూడా ఎవరికీ లేదనే వాదం కూడా తరచూ వినిపించేది. ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ పేరుతో ప్రజావ్యవహారాల సమాచారం మరుగునపడేది. కాని సమాచార హక్కు చట్టం 2005 వచ్చిన తరువాత అటువంటి ప్రివిలేజికి స్థానం లేదు. సెక్షన్ 123 సాక్ష్య చట్టం నియమాన్ని కాదని సెక్షన్ 22 సమాచార హక్కు చట్టం పనిచేస్తుంది. ఆ సమాచారం ఇవ్వవచ్చా లేదా అనే విషయంలో సెక్షన్ 8, 9 తప్ప మరే ఇతర శాసన నియమాలను కూడా పరిశీ లించడానికి వీల్లేదు. 2013-14లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత లెఫ్టినెంట్ గవ ర్నర్ (ఎల్జి)కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక, దానికి సంబంధించిన ఇతర పత్రాల ప్రతులు ఇవ్వాలని ఆదిత్య అనే యువకుడు సహ చట్టం కింద అడిగారు. ఎల్జీ కార్యాలయం ఇవ్వడానికి వీల్లేదన్నది. మొదటి అప్పీలులో కూడ చుక్కెదురైంది. రెండో అప్పీలులో కమిషన్ ముందు ఈ ప్రశ్నకు సమాధానం, సమాచారం దొరుకుతుందా అన్నది రాజ్యాంగం కీలక శాసనాల సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిల్‌లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆర్డర్లు, లాగ్ పుస్త కాలు, ఒప్పందాలు, నివేదికలు, కాగితాలు, నమూ నాలు, మోడల్స్, డేటా, వంటివి ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నవి కూడా సమాచారం నిర్వచనంలోకి వస్తాయని సెక్షన్ 2(ఎఫ్) సహ చట్టం వివరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చింది నివేదిక అయినా, సలహా అయినా, అభిప్రాయమైనా సరే ఈ నిర్వచనం పరిధిలోనే ఉంటుంది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపినది కనుక వారి కార్యాలయంలోనూ, కేంద్ర హోంమంత్రి కార్యాలయంలోనే ఉండి తీరుతుంది. అది సమాచారమే అయి, ప్రభుత్వ అధీనంలో ఉండి ఉంటే వెల్లడించాల్సిందే. అయితే అంతకు ముందు ఒక్కసారి పరిమితులు, మినహాయింపులు ఏమైనా వర్తిస్తాయో లేదో పరిశీలించాలి. ఎల్జీ కార్యాలయ ప్రజాసమాచార అధికారి సెక్షన్ 8(1)(ఐ) కింద ఆ నివేదిక ఇవ్వడానికి వీల్లేదన్నారు. పార్లమెంటు లేదా శాసనసభల ప్రత్యేకా ధికారాల (ప్రివిలేజ్)కు భంగం కలిగిస్తుందనుకునే సమాచారాన్ని ఇవ్వనవసరం లేదని ఈ సెక్షన్ నిర్దేశిం చింది. ఈ నివేదిక వెల్లడి పార్లమెంటు ప్రివిలేజ్ని ఏవిధంగా దెబ్బతీస్తుందని వివరించలేదు. ఊరికే సెక్షన్ నెంబరు చెబితే సరిపోదు. అది ఏ విధంగా వర్తిస్తుందో సమర్థించే బాధ్యత ప్రజా సమాచార అధికారిపైన ఉందని సెక్షన్ 19(5) చాలా స్పష్టంగా వివరిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత మరో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని, కనుక ఢిల్లీ శాసనసభను రద్దు చేయాలనే ఎల్జీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంత జరిగిన తరు వాత వెల్లడి చేయబోమనడానికి అందులో ఏముంది అనేది ప్రశ్న. ఆర్టికల్ 74(2) కింద రాష్ర్టపతికి కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాను, లేదా ఆర్టికల్ 163(3) కింద గవర్నరుకు రాష్ర్ట మంత్రి మండలి ఇచ్చిన సలహాలో లోటుపాట్లను దర్యాప్తుచేసే అధికారం కోర్టు లకు లేదని రాజ్యాంగం వివరిస్తున్నది. కాని మంత్రి మండలి ఆ సలహానివ్వడానికి ఆధారభూతమైన నివేది కలు పరిస్థితులను సమీక్షించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉందని, ఈ సమీక్షాధికారం మన రాజ్యాంగ మౌలిక స్వరూపమని దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదని ఎస్ఆర్ బొమ్మయ్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అంటే మంత్రి మండలి సలహాకు ప్రివిలేజ్ ఉందనుకోవచ్చు. కాని గవర్నర్ నివేదిక ఆ సలహాకు ఆధారం అవుతుంది కనుక పరిశీలించే అధికారం కోర్టులకు ఉందని వివరణ ఇచ్చారు. అంటే ఢిల్లీలో శాసనసభను రద్దు చేయాలని ఎల్జీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు ఏ రక్షణా లేదు. అంతే గాకుండా గవర్నర్‌కు ఉన్న రక్షణ నియమాలు రాజ్యాంగంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పించలేదు. లెఫ్టినెంట్ అంటే ఉప అని అర్థం, ఉప రాజ్య పాలకుడికి ఈ ప్రివిలేజ్ లేదు. ప్రివిలేజ్ ఉందనుకున్నా అది దర్యాప్తు నుంచి రక్షణే కాని అది రహస్యమని అర్థం కాదు. అయినా సమాచారం అడిగిన అభ్యర్థిగా, రెండో అప్పీలు విచా రిస్తున్న సమాచార కమిషన్ గానీ, సలహా బాగోగులకు దర్యాప్తు చేయడం లేదు. ఆ నివేదిక ప్రతిని ఇవ్వమని మాత్రమే కోరుతున్నారు. (ఇఐఇ/అ/అ/2015/000748 ఆదిత్య వర్సెస్ ఎల్జి సచివాలయం కేసులో 25.5.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
నియంతృత్వ పాలనకు కేంద్రం కుట్ర: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్.. దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంలో భాగమని మోదీ సర్కారుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రంతో సుదీర్ఘ పోరుకు సిద్ధమన్నారు. 2 రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు బుధవారం సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ‘దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో, తర్వాత ఒకటొకటిగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో దీన్ని అమలుచేస్తారు. కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలన్నీ కలిసిరావాలి’ అని కోరారు. కాగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. -
అన్నివిధాలా ఆదుకుంటాం
బాధితులకు ఎల్జీ భరోసా సహాయక చర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాద బాధితులకు అన్ని రకాల తక్షణ సహాయం అదించాలని ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు ఎల్జీ భరోసా ఇచ్చారు. శుక్రవారం ఉదయం వసంత్‌కుంజ్ సమీపంలోని మసూద్పురా జుగ్గీజోపిడీలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎల్జీ సందర్శించారు. ప్రమాద బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున సహాయం అందుతుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే 35 ఫైర్ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపినట్టు డిప్యూటీ కమిషనర్ ఎల్జీకి వివరించారు. క్షతగాత్రుల కోసం 12 అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని హుటాహుటిన రప్పించినట్టు వారు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటల్లో చిక్కుకొని గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గుడిసెలు కాలిపోయి నిరాశ్రయులైన వారందరికీ తక్షణమే వసతి సదుపాయాలు కల్పించాలని ఎల్జీ ఆదేశించారు. సంఘటన స్థలానికి సమీపంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, 24 గంటల పాటు వైద్య సహాయం అందించాలని చెప్పారు. బాధితులకు మంచినీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని సూచించారు. అవసరం మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని డిప్యూటీ కమిషనర్‌కి చెప్పారు. క్షతగాత్రులందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఎల్జీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎల్జీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం వరకు సహాయ శిబిరాల వద్ద పది మంచినీటి ట్యాంకర్లు, ఎంసీడీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారులు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
అవినీతి కాంగ్రెస్ నేతలకు ఆప్ సర్కారు అండ
న్యూఢిల్లీ: వివిధ కుంభకోణాల్లో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు ఇతర మంత్రులకు కేజ్రీవాల్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈ నెల 23వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేస్తామని ఆ పార్టీ ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా తెలి పారు. పార్టీ సహచరుడు జగదీష్ ముఖితో కలసి శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. షీలా ప్రభుత్వం అధికారంలో ఉండగా నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలను సేకరిం చేందుకు బీజేపీ ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించిందని అన్నా రు. ఈ కమిటీకి జాతీయ న్యాయవిభాగం కార్యదర్శి పింకీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారన్నారు. షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఆదేశించాలని ఎల్జీని కోరతామన్నారు. అధికారంలోకి రాగానే అవి నీతిని అంతం చేయడమే తమ లక్ష్యమంటూ శాసనసభ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచారం సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గాలికి వదిలేసిందన్నారు. కామన్వెల్త్ క్రీడాకుంభకోణంపై ప్రధానంగా తాము దృష్టి సారిస్తామంటూ ఆ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిందన్నారు. ఆ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు అనేకమంది అధికారుల ప్రమేయం ఉందన్నారు. -
హర్షవర్ధన్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చకు... ఢిల్లీలో త్రిశంకు ఫలితాల నేపథ్యంలో సర్కారు ఏర్పాటులో నెలకొన్న స్తబ్దతను తొలగించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం రాత్రి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చల కోసం గురువారం రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీకి 31, దాని మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు ఒక స్థానం లభించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 28 స్థానాలు లభించగా, కాంగ్రెస్‌కు ఎనిమిది, జేడీయూకు ఒకటి, మరొక స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కాయి. బీజేపీ, ఆప్ బుధవారం ఉదయం తిరిగి ఎన్నికలకే సిద్ధపడతామని ప్రకటించాయి. మెజారిటీ సంఖ్యాబలం లేనందున సర్కారు ఏర్పాటు అవకాశం కల్పించాల్సిందిగా గవర్నర్‌ను కోరబోమని హర్షవర్ధన్ తొలుత ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌తో బుధవారం మాట్లాడారు.