‘మహిళా సమ్మాన్‌’పై దర్యాప్తు చేయండి  | Delhi L-G orders probe into AAP Mahila Samman scheme over illegal data | Sakshi
Sakshi News home page

‘మహిళా సమ్మాన్‌’పై దర్యాప్తు చేయండి 

Published Sun, Dec 29 2024 6:08 AM | Last Updated on Sun, Dec 29 2024 6:08 AM

Delhi L-G orders probe into AAP Mahila Samman scheme over illegal data

మహిళల వివరాల్ని సేకరించే వారిపై చర్యలు తీసుకోండి 

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశాలు 

సాక్షి, న్యూఢిల్లీ: మహిళా సమ్మాన్‌ యోజన పేరుతో మహిళల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్‌ వ్యక్తులు సేకరించడంపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అధికారులను శనివారం ఆదేశించారు. పథకంపై ఎన్నికల సమయంలో ప్రచారం జరుగుతున్న తీరును ఎలక్టోరల్‌ అధికారి ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆయన ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. కాంగ్రెస్‌ నేత, న్యూఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్‌ బుధవారం స్వయంగా తనకు చేసిన ఫిర్యాదుపై ఎల్జీ సక్సేనా ఈ మేరకు స్పందించారు. 

మహిళలకు ఆశ చూపి వ్యక్తిగత వివరాలను సేకరిస్తూ వారి గోప్యతకు భంగం కలిగించే వారెవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఎల్జీ పోలీస్‌ కమిషనర్‌కు సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ అభ్యర్థుల ఇళ్ల వద్ద పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు నిఘా పెట్టినట్లు ఆరోపణలున్నాయని ఎల్జీ పేర్కొన్నారు. దీంతోపాటు, ఢిల్లీ ఎన్నికల్లో పంచేందుకు పంజాబ్‌ నుంచి డబ్బులు అందుతున్నాయన్నారు. 

మహిళా సమ్మాన్‌ యోజన కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆప్‌ ప్రభుత్వం అందజేస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆప్‌ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి మహిళల వివరాలను సేకరిస్తూ దరఖాస్తులను పూర్తి చేయిస్తున్నారు. అయితే, బయటి వ్యక్తులు వచ్చి అందజేసే దరఖాస్తులను నింపొద్దంటూ గత వారం మహిళా శిశు అభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఈ పథకం అమలు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తామని స్పష్టతనిచ్చింది.  

ఆప్‌ను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర: కేజ్రీవాల్‌ 
మహిళా సమ్మాన్‌పై దర్యాప్తు జరపాలన్న ఢిల్లీ ఎల్జీ ఆదేశాలపై ఆప్‌ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఉత్తర్వులు ఎల్జీ కార్యాలయం నుంచి కాదు, అమిత్‌ షా నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ పథకాలను అడ్డుకునేందుకే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయంటూ నిప్పులు చెరిగారు. నేరుగా చర్యలు తీసుకునే ధైర్యం లేని బీజేపీ, కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌తో ఫిర్యాదు చేయించిందని ఆరోపించారు. ‘ఎన్నికల్లో గెలిచాక మేమిచ్చే పథకాలతో లక్షలాది మంది మహిళలకు నెలకు రూ.2,100, వృద్ధులకు ఉచిత వైద్యం అందుతుంది. 

ఈ పథకాలను చూసి బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది’అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిస్తే తమ సంక్షేమ పథకాలన్నిటినీ నిలిపివేస్తుంది, అరాచకం రాజ్యమేలుతుందన్నారు. ‘ఎన్నికల్లో గెలిస్తే అమలు చేస్తామని ప్రకటించాం. ఇందులో విచారించడానికేముంటుంది? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ గూండాలు, పోలీసులు కలిసి పథకాల నమోదు శిబిరాలు జరక్కుండా అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేజ్రీవాల్‌పై నమ్మకముంచాలని, పథకాల కోసం పేర్లు నమోదు చేసుకోవాలని ఢిల్లీ ప్రజలను ఆయన కోరారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement