ఆస్పత్రిలో సిసోడియాను పరామర్శిస్తున్న ఎస్పీ నేత రామ్‌గోపాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ అధికారంతో ఆప్ ప్రభుత్వం ఈ ధర్నా చేపట్టిందని ప్రశ్నించింది. ధర్నాను ఆపడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వనప్పటికీ.. ఇతరుల ఇళ్లు, కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం సరికాదని మండిపడింది. కేజ్రీవాల్ నిరసన, ఢిల్లీ ప్రభుత్వంపై ఐఏఎస్‌లు సమ్మె చేయడంపై దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఏకే చావ్లా, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘ధర్నా చేసే అధికారం ఎవరిచ్చారు. ఎల్జీ కార్యాలయంలో బైఠాయిస్తారా? ఇది ధర్నా అయితే.. కార్యాలయం బయట చేసుకోండి. ఒకరి కార్యాలయం, నివాసంలో ధర్నా చేసే అధికారం మీకు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారులు విధుల్లో చేరేలా ఆదేశించడంతోపాటు.. పనులను అడ్డుకుంటున్న వారిపై ఎల్జీ అనిల్ బైజాల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 11 నుంచి ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.
నిరసన రాజ్యాంగ హక్కు!
ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సుధీర్ నంద్రాజోగ్ వాదిస్తూ.. సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హోదాలో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్‌లు నిరసన చేపట్టారన్నారు. ఇది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. విధులకు దూరంగా ఉంటున్న ఐఏఎస్ అధికారులు రోజూవారి మంత్రుల సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు.
అయితే, ఐఏఎస్ అధికారులు సమ్మె చేయడం లేదని.. కేజ్రీవాల్, అతని మంత్రులు వెంటనే ఎల్జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వ విపక్ష నేత విజేందర్ గుప్తా కూడా కేజ్రీవాల్ తీరును నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఐఏఎస్‌లు తిరిగి విధులకు వచ్చేలా ఎల్‌జీని ఆదేశించాలని ఆయన కోరారు.
అలాగైతే చర్చలకు ఓకే..
అధికారులకు రక్షణ కల్పిస్తామంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారులు స్వాగతించారు. ఈ విషయంపై సీఎంతో చర్చించేందుకు సిద్ధమేనని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ రక్షణ, గౌరవాన్ని కాపాడే అంశాలపై నిర్దిష్టమైన చర్యలుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఇంతకుముందు లాగే చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యే ఒకరు సీఎం సమక్షంలోనే దాడికి దిగిన నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆప్ పార్టీ కూడా భద్రతపై సీఎం భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు విధులకు హాజరు కావాలని కోరింది.
ఆసుపత్రికి సిసోడియా
కేజ్రీకి మద్దతుగా జూన్ 13 నుంచి నిరాహార దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అస్వస్థతకు గురవడంతో ఆయనను ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేజ్రీ ట్విట్టర్లో వెల్లడించారు. అనంతరం సిసోడియా ట్వీట్ చేస్తూ.. ‘మా అధికారులతో చర్చలు జరిపేందుకు సంతోషంగా అంగీకరిస్తున్నాం. వీరికి సరైన భద్రత కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ బాధ్యత ఎల్జీ చేతుల్లో ఉంది’ అని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్నా చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా, జైన్‌ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కేజ్రీవాల్ ఫోన్ చేశారు. దీనిపై ఉద్ధవ్ స్పందిస్తూ.. ‘ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకునే పరిస్థితి కల్పించాలి. ప్రతి అడుగులో అడ్డంకిగా మారొద్దు’ అని కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment