
గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామా
ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. 2013లో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్గా నజీబ్ జంగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నజీబ్ జంగ్ మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 18 నెలలు ముందుగానే జంగ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే తనకు సహకరించిన కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా నజీబ్ జంగ్ తిరిగి తనకు ఇష్టమైన అధ్యాపక వృత్తిలోకి వెళ్లనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు హఠాత్తుగా గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై నజీబ్ జంగ్ ఎటువంటి కారణాలు మాత్రం వెల్లడించలేదు.
ఇక ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య మొదటి నుంచీ సామరస్యత లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్న విషయం తెలిసిందే.