ఢిల్లీలో త్రిశంకు ఫలితాల నేపథ్యంలో సర్కారు ఏర్పాటులో నెలకొన్న స్తబ్దతను తొలగించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం రాత్రి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్‌తో మాట్లాడారు.
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చకు...
ఢిల్లీలో త్రిశంకు ఫలితాల నేపథ్యంలో సర్కారు ఏర్పాటులో నెలకొన్న స్తబ్దతను తొలగించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం రాత్రి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చల కోసం గురువారం రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీకి 31, దాని మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు ఒక స్థానం లభించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 28 స్థానాలు లభించగా, కాంగ్రెస్‌కు ఎనిమిది, జేడీయూకు ఒకటి, మరొక స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కాయి. బీజేపీ, ఆప్ బుధవారం ఉదయం తిరిగి ఎన్నికలకే సిద్ధపడతామని ప్రకటించాయి. మెజారిటీ సంఖ్యాబలం లేనందున సర్కారు ఏర్పాటు అవకాశం కల్పించాల్సిందిగా గవర్నర్‌ను కోరబోమని హర్షవర్ధన్ తొలుత ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌తో బుధవారం మాట్లాడారు.