విశ్వాసతీర్మానంపై ఎవరేమన్నారు...
Published Thu, Jan 2 2014 11:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
ఢిల్లీ ప్రజలు తమకు నైతిక విజయాన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీ నిరాకరించిన తర్వాత తాము నైతిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అయితే తమకు సర్కార్ నడపడానికి కావలసిన పూర్తి మెజారిటీ లేదు. ప్రజాహితం కోసం కొన్ని అంశాలపై పనిచేయాలనుకుంటున్నాం. అందుకు విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. నగరాభివృద్ధి విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గం. రాజధాని వాసులకు స్వచ్ఛమైన నీరు, చౌక విద్యుత్‌ను అందేలా చూస్తాం. వీఐపీ సంస్కృతిని అంతమొందించడం, పటిష్టమైన లోక్‌పాల్ తేవడం, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, స్కూళ్లు, ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐని వ్యతిరేకిస్తాం.
కాంగ్రెస్‌తో చెలిమి కరెక్ట్ కాదు: డాక్టర్ హర్షవర్దన్
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ పై ఢిల్లీవాసులు, దేశవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మద్దతు ఇవ్వబోం, తీసుకోబోం అన్న ఆయన మాటలు విని ఆదర్శభావాలకు ప్రజలు పొంగిపోయారు. అయితే ఆయన అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తానని అన్న కేజ్రీవాల్ ఇప్పుడు సాక్ష్యాలను కోరుతున్నారు. రామ్‌లీలా మైదాన్‌కు ప్రమాణస్వీకారానికి మెట్రోలో వెళ్లి ప్రజా భద్రతను పణంగా పెట్టారు. సబ్సిడీపై విద్యుత్తు రేట్లను తగ్గించి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని వారికే ఇస్తున్నారు. అభివృద్ధికి ఖర్చు చేయవలసిన సొమ్మును విద్యుత్ కంపెనీలకు సబ్సిడీ పేరిట ఇచ్చేస్తున్నారు. ప్రజలను అడిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామన్న మనీశ్ సిసోడియా మాటలను తప్పుబట్టారు. మొహల్లాలో వంద, యాభై మందిని పిలిచి అడిగితే అంతా చేతులు ఎత్తుతారని అంటున్నారు. కాానీ నిజమైన ప్రజాభీష్టం ఓట్ల ద్వారానే వ్యక్తమవుతుంది. అది తమకు లభించింది.
ఢిల్లీ వాసుల మేలు కోసమే మద్దతు: లవ్లీ
విశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్నాం. ఎన్నికల హామీలను నెరవేర్చడం కోసమే తాము ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. . ఢిల్లీ ప్రజల మేలు కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేసినంతకాలం తమ మద్దతు కొనసాగుతుంది. అవసరమైతే ఐదేళ్ల పాటు ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. తొందరపాటు నిర్ణయాలు ఆప్ తీసుకోవద్దు. ప్రతిపక్ష నేత హర్షవర్ధన్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతికి పాల్పడిన బీజేపీ నీతివ్యాఖ్యలు మాట్లాడటం సబబు కాదు. బీజేపీ ఎన్నాళ్లయినా ప్రతిపక్ష బెంచీలలోనే ఉంటుంది. మోహన్‌చంద్ శర్మ సతీమణికి మా ప్రభుత్వమే ఉద్యోగమిచ్చింది.
Advertisement
Advertisement