ముంబై: రాష్ట్ర చరిత్రపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఏ మాత్రం అవగాహన లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తూర్పారబట్టింది. 1960 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని, మోడీ చెప్పినట్టుగా 26 మంది కాదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్థానిక సంస్థల పన్ను(ఎల్‌బీటీ)ను మోడీ తప్పుబట్టడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇది ఈ ఒక్క రాష్ట్రంలోనే అమలుచేయడం లేదని, వేరే రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి ఉందని తెలి పారు. రాష్ట్రం నుంచి ఉత్తర ప్రాంత రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసే భారీ వాహనాలు గుజరాత్ మీదుగానే వెళుతున్నాయని చెప్పారు.
మోటారు వాహనాల పన్నును అత్యధికంగా వారే వసూలు చేస్తున్నారని మాలిక్ మండిపడ్డారు. గుజరాత్ నుంచి రాష్ట్రానికి వచ్చే వాహనాలు చాలా తక్కువ అని చెప్పారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు గేట్‌లు కూడా ఏర్పాటుచేయలేదన్న మోడీ ఆరోపణలను తప్పుబట్టారు. నిర్వాసితులకు ఇప్పటివరకు మధ్యప్రదేశ్ పునరావాసం కల్పించకపోవడంతో గేట్‌లు అంశం పెండింగ్‌లో ఉందన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు వజ్రాల వ్యాపారులు రూ.25 కోట్ల విరాళం ఇవ్వడంపై మాలిక్ మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ వాళ్లు లూటీ చేయడం ప్రారంభించారన్నారు. మోడీ ర్యాలీకి హాజరైన వారిలో ఎక్కువగా గుజరాత్ నుంచి వచ్చిన వారే ఉన్నారని తెలిపారు. మోడీ నినాదం ‘ఓట్ ఫర్ ఇండియా’ అయితే, తమది ఓట్ ఫర్ భారత్ అని చమత్కరించారు. వచ్చే ఎన్నికలు ఇండియా, భారత్‌ల మధ్య పోరుకు సాక్ష్యంగా నిలుస్తాయని తెలిపారు.
మోడీ..చరిత్ర తెలుసుకో: ఎన్సీపీ
Published Sun, Dec 22 2013 11:20 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement