సాక్షి, ముంబై: మంత్రాలయ ఆధునీకరణ పనులు పూర్తి కావస్తుండటంతో ఆయా అంతస్తుల్లోని క్యాబిన్‌లలో చేరి విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర మంత్రులు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా గదులు కళకళలాడనున్నాయి. ఇన్నాళ్లు సరైన గదులు లేక ఇబ్బందులు పడ్డ మంత్రులు ఇక నుంచి తమ పాలనను సాఫీగా సాగించేందుకు తమకు నచ్చిన క్యాబిన్‌లను దక్కించుకునే వేటలో పడ్డారు. ఇందులో అందరి కంటే ముందుగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆరో అంతస్తులో ఉన్న తన క్యాబిన్‌లోకి ప్రవేశించి విధులు నిర్వహించడం మొదలెట్టారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సోమవారం తన క్యాబిన్‌లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఇక నుంచి కొత్త క్యాబిన్ నుంచి తమ కార్యకలాపాలు చేపడతారని మంత్రాలయ వర్గాలు వెల్లడించాయి.
మారిన క్యాబిన్ల రూపురేఖలు
2012 జూన్ 21వ తేదీన మంత్రాలయ భవనానికి జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం నాలుగు అంతస్తులు కాలిబూడిదయ్యాయి. దీంతో కోట్ల రూపాయలు ఖర్చుచేసి మొత్తం మంత్రాలయ భవనం రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు. ప్రస్తుతం మంత్రాలయ భవనానికి పూర్వవైభవం తెచ్చే పనులు తుది దశలో ఉన్నాయి. ఇందులో కొన్ని క్యాబిన్లు సిద్ధం కావడంతో మంత్రులకు అప్పగిస్తున్నారు. అగ్నిప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి మొదలుకుని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, సహాయ మంత్రులు తమతమ క్యాబిన్లు, చాంబర్‌లు ఆధునిక హంగులతో ఎవరికిష్టమున్నట్లు వారు తయారు చేయించుకుంటున్నారు. ప్రతి అంతస్తులో క్యాబిన్ల రూపురేఖలు మారిపోయాయి. ఇందులో ఖరీదైన కుర్చీలు, టేబుళ్లు, ఏసీ, కర్టెన్లు తదితర సామగ్రి అమర్చుకుని ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఆధునీకరణ పనుల తర్వాత క్యాబిన్లు, చాంబర్లు మారిపోవడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సందర్శకులకు ఇబ్బందులు...
వివిధ పనుల కోసం మంత్రాలయకు వచ్చే సందర్శకులకు ఇక నుంచి ఒకే పాస్ జారీ చేయనున్నారు. గతంలో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పాస్ తీసుకున్న సందర్శకులు లోపలికి వెళ్లిన తర్వాత మంత్రాలయ భవనంలో ఎక్కడ తిరిగినా అడిగే వారు లేరు. ఏ అధికారి వద్దకైనా, ఏ అంతస్తుకైనా వెళ్లేందుకు అవకాశముండేది. కానీ మంత్రాలయ భవన ఆధునీకరణ తర్వాత కొత్త పద్ధతిని ప్రారంభించారు. ఏ అంతస్తు, ఎవరి క్యాబిన్‌లోకి వెళ్లాలో ఆ అంతస్తు పాస్ మాత్రమే జారీ చేస్తారు. దీంతో ఇతరుల వద్దకు వెళ్లేందుకు వీలుపడదు. గేట్ దగ్గర ఇచ్చిన పాస్ స్వైప్ చేస్తే ఆ అంతస్తు డోరు, సంబంధిత అధికారి క్యాబిన్ తెరుచుకుంటుంది. ఇతర పనులుగాని, మరో అధికారిని కలవాలంటే ఇక నుంచి కుదరదు.
మంత్రాలయ కళకళ
Published Sun, Oct 27 2013 12:18 AM | Last Updated on Tue, Oct 9 2018 3:56 PM
Advertisement
Advertisement