కొత్త పార్టీ అంటే ఆత్మహత్యే...!
నటుడు విజయ్‌కి తండ్రి హితబోధ
కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడం అంటే ప్రస్తుత పరిస్థితిలో ఆత్మహత్యతో సమానమని నటుడు విజయ్‌కి తండ్రి హితబోధ చేశారు. అసలు విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులుండడం వారంతా రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకురావడంతో నటుడు విజయ్‌కి రాజకీయ రంగ ప్రవేశంపై మోహం పెరిగింది. ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా 350 అభిమాన సంఘాలు వున్నాయి. సుమారు 10 లక్షల మంది వీరాభిమానులున్నారు. వీరంతా తమ నాయకుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నారు. దీంతో విజయ్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంఘాన్ని నెలకొల్పారు.
ఆ తరువాత రాజకీయల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసి చర్చించారు. అదే సమయంలో రాష్ట్రంలో డీఎంకే పార్టీతో సన్నిహితంగా మెలిగారు. అలాంటి సమయంలో తన చిత్రం విడుదలకు ఎదురైన సమస్యలు, నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో విబేధాలతో మనస్థాపం వంటి కారణాలతో డీఎంకేకు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలెట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా విజయ్, ఆయన తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ ప్రచారం చేశారు. ఆ పార్టీ విజయం సాధించడంతో ఆ ఘనత తమదేనంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం పసిగట్టిన ఆ పార్టీ అధిష్టానం ఆదిలోనే మేల్కొని విజయ్‌ను పక్కన పెట్టింది.
ఆ తరువాత తుపాకీ, కత్తి చిత్రాలు విడుదలలో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో విజయ్ చాలా కలత చెందారు. దీంతో కొన్ని రోజులు మౌనంగా వున్న ఈ స్టార్ నటుడు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన జాలర్ల విషయంలో జోక్యం చేసుకుని ప్రధాని నరేంద్రమోదీకి తన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో విజయ్ తన తండ్రి ఎస్‌ఎ చంద్రశేఖర్‌తో సంప్రదించారట. అందుకాయన ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా పార్టీ పెట్టడం ఆత్మహత్యతో సమం అంటూ హితబోధ చేశారట. 50 ఏళ్ల దాటిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు సినిమాలో నటించమని సలహా ఇచ్చారని కోలీవుడ్ వర్గాల టాక్.