• మెట్టూరు, భవానీ
• సాగర్‌లో పరిశీలన
• ఢిల్లీ బృందంతో
• ఎడపాడి సమాలోచన
• నేడు అన్నదాతల చెంతకు
సాక్షి, చెన్నై: కావేరి ఉన్నత స్థాయి సాంకేతిక పరిశీలన కమిటీ రాష్ర్టంలో పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఆదివారం మెట్టూరు, భవానీ సాగర్ జలాశయాల్లో ఈ కమిటీ పరిశీలన సాగింది. ఈ బృందంతో రాష్ట్ర ప్ర జా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి సమాలోచించారు. ఇక, ఈ కమిటీ డెల్టాలో కమిటీ సోమవారం తంజావూరు, తిరువారూర్, నాగపట్నంలలో పర్యటించనున్నది. కావేరి జల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర ఉన్నత స్థాయి సాంకేతిక పరిశీలన కమిటీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే.వాటార్ కమిషన్ చైర్మన్ జీఎస్ జా నేతృత్వంలో ఎస్ మజూద్, ఆర్‌కే గుప్తాలతో కూడిన ఈ కమిటీలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల అధికారులు ఉన్నారు.
శుక్ర, శనివారాల్లో ఈ కమిటీ కర్ణాటకలోని జలాశయాల్లో నీటి పరిస్థితి, అక్కడి సాగుబడిని పరిశీలించింది. అక్కడ పర్యటన ముగించుకుని శనివారం అర్థరాత్రి సేలం చేరుకున్న ఈ కమిటీకి ఆ జిల్లా కలెక్టర్ సంపత్ ఆహ్వానం పలికారు. ఆదివారం ఉదయాన్నే ఈ కమిటీ స్థానిక అధికారులతో సమీక్షించింది. ఈ సమయంలో రాష్ర్ట ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి అక్కడికి చేరుకుని ఈ కమిటీకి ఓ నివేదిక సమర్పించారు. డెల్టా జిల్లాల్లో సాగుబడి , నీటి అవసరాలను వివరిస్తూ అందులో పూర్తి సమాచారం పొందు పరిచారు. ఈ నివేదికపై సమాలోచన అనంతరం నేరుగా మెట్టురు డ్యాంకు జిఎస్ జా నేతృత్వంలో బృందం చేరుకుంది.
డెల్టాలో పరిశీలన: మెట్టురు డ్యాంకు చేరుకున్న ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అధికారులు సుబ్రమణియన్, ప్రభాకర్‌లు జీఎస్ జాకు అక్కడి పరిస్థితిని వివరించారు. డ్యాంలో నీటి మట్టం, బురద, నీటి రాక, విడుదల తదితర వివరాలను జీఎస్ జా వెంట ఉన్న అధికారులు నమోదు చేసుకున్నారు. నీటి పరిస్థితిని సమీక్షించినానంతరం ఈరోడ్ జిల్లా భవానీ సాగర్‌కు చేరుకున్నారు. అక్కడ నీటి పరిస్థితి పరిశీలించారు. కావేరి తీరం వెంబడి సాగును పరిశీలిస్తూ, నీటి అవసరాల మీద సమగ్ర నివేదికకు ఈ కమిటీ నిర్ణయించింది. సోమవారం తిరువారూర్, తంజావూరు, నాగపట్నంలలో ఈ కమిటీ పరిశీలించి ఏ మేరకు సంబాసాగుబడి సాగుతున్నదో అధ్యయనం చేయనున్నది.
ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే జీఎస్ జా ఈనెల పదిహేడున సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కాగా, డెల్టా జిల్లాల్లో పర్యటించనున్న ఈ కమిటీ ఆయా జిల్లాల్లోని రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు, అన్నదాతలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కావాలని, అప్పుడే వాస్తవిక పరిస్థితి తెలుస్తుందని రాజకీయ పక్షాలు సూచించే పనిలో పడ్డారు. ఈ విషయంగా డిఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ పేర్కొంటూ, మొక్కుబడి పరిశీలనగా కాకుండా, అన్ని వర్గాల్ని కలుపుకుని కమిటీ ఏర్పాటు చేసి ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడెక్కడ నీటి అవసరాలు మరీ ఎక్కువో అన్న వివరాలను సమగ్రంగా పరిశీలించాలని , రైతు ప్రయోజనార్థం అధికారులు పూర్తి వివరాలను కమిటీ ముందు ఉంచాలని సూచించారు
ముగ్గురు : కావేరి జల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లు ఇది వరకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ విచారిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ అన్ని పిటిషన్లను విచారించనున్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 17, 18 తేదిల్లో ఈ బెంచ్ ముందుకు పిటిషన్ల విచారణలు రానున్నాయి. ఇక, కావేరి అభివృద్ధి మండలి, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ నేతృత్వంలో కమలనాథులు ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మోర పెట్టుకున్నారు.
డెల్టాలో కమిటీ
Published Mon, Oct 10 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement
Advertisement