‘కొత్త’ సంబరం
Published Thu, Jan 2 2014 2:53 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : బీచ్‌లన్నీ జనంతో కిటకిటలాడాయి. చిన్నా, పెద్దా, ఆడమగా తేడా లేకుండా మంగళవారం రాత్రి 8 గంటల నుంచే ప్రజలు రోడ్లలో, బీచ్‌లలో చేరిపోయారు. రాత్రి 12 గంటలు దాటి కొత్త ఏడాదిలోకి ప్రవేశించగానే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొన్ని చోట్ల రంగులు చల్లుకున్నారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచే దేవాలయాలు, చర్చిల వద్ద భక్తులు క్యూకట్టారు. చెన్నై టీ నగర్‌లోని టీటీడీ దేవాలయంలో శ్రీవారికి విశేషపూజలు నిర్వహించారు. వేకువజామున 3 గంటల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మైలాపూరులోని సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. మధురై మీనాక్షి, కంచి కామాక్షి, బెసెంట్‌నగర్‌లోని అష్టలక్ష్మీ ఆలయం, అన్నానగర్‌లోని అయ్య ప్ప దేవాలయం, అంతోనీమాతా, శాంతోమ్ చర్చిల్లో క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రార్థనలు జరిపారు.
వేడుకల్లో విషాదం
ఎప్పటివలెనే ఈ ఏడాది కూడా కొత్త ఏడాది వేడుకలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వివిధ సంఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయూరు. చెన్నై ఎంకేబీ నగర్‌కు చెందిన రామనారాయణ సింగ్ (42) వెళుతున్న బైక్‌ను వ్యాసార్పాడి వద్ద ఒక టిప్పర్ లారీ ఢీ కొనడంతో దాని కిందపడి అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనలో లారీడ్రైవర్ ముత్తువేల్‌ను అరెస్ట్ చేశారు. సైదాపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రాంప్రసాద్ (20) వెస్ట్ మాంబళానికి చెందిన తన స్నేహితుడు శరవణన్‌తో కలిసి కొత్త ఏడాది వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌లో బయలుదేరాడు.
బిసెంట్‌నగర్ బీచ్ వద్ద వీరు లారీని ఓవర్‌టేక్ చేయబోతూ అదేలారీని వెనుకభాగంలో ఢీకొట్టారు. తలకు తీవ్రగాయాలైన రాంప్రసాద్ మృతి చెందగా, శరవణన్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యూడు. కొడెకైనాల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి ప్రకాష్ (22) ఈక్కాడు తాంగల్ వద్ద వేడుకల హుషారులో స్పీడ్‌బ్రేకర్‌ను వేగంగా దాటాడు. దీంతో అదుపుతప్పి కిందపడగా వెనుకనే వస్తున్న బస్సు కిందపడి ప్రాణాలు విడిచాడు. కొరట్టూరుకు చెందిన తమిళ్ సెల్వన్ (22) తన స్నేహితుడిని బైక్‌లో ఇంటి వద్ద దింపి తిరిగి వస్తుండగా మన్నూర్‌పేట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మధురై కే పుత్తూరుకు చెందిన అన్బుసెల్వన్ (24) పూందమల్లి వద్ద బైక్‌లో వెళుతుం డగా లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ చక్రాల కిందపడి అతను మృతి చెందాడు. డ్రైవర్ శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెదిరిన గుర్రాలు-గాయాలు
చెన్నై మెరీనా బీచ్‌కు చేరిన జనాలను అదుపుచేసేందుకు పోలీస్ అశ్వదళం రంగంలోకి దిగింది. సుమారు 50కి పైగా పోలీసులు గుర్రాలను అధిరోహించి బందోబస్తు పనిలో నిమగ్నమయ్యూరు. అర్దరాత్రి 12 గంటలు దాటగానే ప్రజలు పెద్ద పెట్టున కేకలు వేస్తూ కేరింతలు కొట్టారు. దీంతో బెదిరిపోయిన గుర్రాలు కిక్కిరిసిన జనం మధ్య పరుగులు పెట్టాయి. దీంతో కొద్దిసేపు తొక్కిసలాట ఏర్పడింది. గుర్రాలపై కూర్చున్న మహిళా పోలీసు, మరో పోలీసు గుర్రాల పరుగును తట్టుకోలేక కిందపడ్డారు. ఈ సంఘటనలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. కొడుంగయ్యూర్ అన్బునగర్ వద్ద 2013 సంత్సరపు దిష్టిబొమ్మను దగ్దం చేసిన యువకులు మోటార్‌బైక్‌లో వెళుతూ బాణాసంచా పేల్చడంతో 20 మంది గాయపడ్డారు. పుదుచ్చేరి బీచ్‌లో జనం కొత్త సంవత్సర సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఒక తాగుబోతు బీర్‌బాటిల్‌ను వారిమధ్యకు విసిరివేశాడు. ఈ గందరగోళంలో 10మందికి పైగా గాయపడ్డారు. బైక్‌లపై వేగంగా వెళ్లరాదంటూ పోలీసులు విధించిన నిషేధాజ్ఞలను ధిక్కరించిన వెయ్యిమంది యువకులను చెన్నై నగర పోలీసులు పట్టుకుని హెచ్చరికలు జారీ చేశారు. .
Advertisement
Advertisement