సాక్షి, ముంబై: దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా గుర్తింపు పొందిన ఠాణే జిల్లాలో మహిళలకు ప్రాధాన్యం కల్పించకపోవడం గమనార్హం. ఈ విషయంలో అన్ని పార్టీలూ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చట్టసభల్లో ఊదరగొడుతున్న రాజకీయపార్టీలు వాస్తవ పరిస్థితుల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఠాణే జిల్లాలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలుండగా, 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ మహిళా ఎమ్మెల్యే లేకపోవడం విశేషం. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కనీసం ఒక్క మహిళకైనా టిక్కెట్ ఇస్తాయని అందరూ భావించారు. అయితే అన్ని రాజకీయ పార్టీలూ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేకపోవడం విశేషం.
గత చరిత్రను పరిశీలిస్తే వసాయికి చెందిన తారాబాయి వర్తక్ జిల్లాకు నేతృత్వం వహించారు. ఆమె రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. అనంతరం చంద్రికా కెనియా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరాజయం పాలైంది. మరోవైపు గత ఎన్నికల్లో 2009లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) వైశాలి దరేకర్‌ను బరిలోకి దింపింది. అయితే ఆమె కూడా పరాజయం పాలైంది. కాని అనంతరం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం మహిళలకు ఏ పార్టీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆఖరికి బీజేపీ అయినా మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తుందేమోనని అందరూ ఆతృతగా ఎదురుచూడగా, ఆ పార్టీ కూడాఎన్సీపీ నుంచి బీజేపీలో ప్రవేశించిన కపిల్ పాటిల్‌కు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు అనుకూలంగా కన్పిస్తోంది.
పేక‘మేడ’లపై దృష్టి
Published Thu, Mar 20 2014 10:41 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement