షెల్టర్ లేని కుడతిని రైల్వేస్టేషన్
- ఎండలో రైళ్ల కోసం
- ప్రయాణికుల పడిగాపులు
- స్టేషన్‌లో లోపించిన సౌకర్యాలు
బళ్లారి (తోరణగల్లు): కుడతిని గ్రామాన్ని ఆనుకొని కేపీసీఎల్, ఏసీసీ సిమెంట్స్, శాతవాహన, అటు పక్క జిందాల్, మినెరా తదితర మరో నాలుగు కర్మాగారాలు ఉన్నాయి. పరిసర గ్రామాల్లో వేణివీరాపురం, సిద్దమనహళ్లి, సుల్తాన్‌పురం, మాదాపురం, హరగినడోణి తదితర గ్రామాల్లోని ప్రజలు, కర్మాగారాల్లోని కార్మికులు కుడితిని రైల్వేస్టేషన్ నుంచి బళ్లారి, తోరణగల్లు, దరోజీ, హొస్పేట, హులిగి, కొప్పళ, గదగ్, హుబ్లీ తదితర ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో వెళ్తుంటారు. అయితే కుడతిని రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు వేచి ఉండటానికి ప్లాట్‌ఫారంలపై షెల్టర్ లేదు.
దీంతో మండుటెండలో కింద కాళ్లు కాలుతుంటే రైళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇక వర్షాకాలంలో వానకు తడవాల్సిందే. శీతాకాలంలో అయితే కొంతవరకు పర్వాలేదు. కాని ఎండాకాలంలో ఎండలో వేచి ఉండాలంటే ఆ పరిస్థితి ప్రయాణికులకే ఎరుక. ఎండలో పడిగాపులు కాసే ప్రయాణికులు గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లు కూడా కరువే. మరుగుదొడ్లు అసలే లేవు. దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన రైల్వేశాఖ లాభాలతో విరాజిల్లుతున్నా ఇలాంటి స్టేషన్‌లను మెరుగుపరిచే చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రయాణికులు ఇబ్బందులను గుర్తించి కుడతిని రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై షెల్టర్‌ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.