కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో లభించిన చిన్నారి (ఫైల్)
కామారెడ్డి క్రైం: ఏ తల్లి కన్న బిడ్డనో.. ఏడాదిన్నర వయస్సులో కన్నవారికి దూరమై వారం రోజులుగా ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉంది. కన్నవారి కోసం పరితపిస్తూ దీనంగా చూస్తోంది. గత గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఓ చిన్నారిని గుర్తు తెలియని మహిళ వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం ఆ చిన్నారి నిజామాబాద్ బాలల సంరక్షణ విభాగం వద్ద ఉంది. అయితే ఆ పాప ఎవరు.. ఆమెను ఎవరు వదిలి వెళ్లారు.. ఎందుకు వదిలేశారు అనే విషయాలు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఆమెను ఎక్కడి నుంచి, ఎవరు తీసుకుని వచ్చారు అనే విషయాలను తెలుసుకోవడానికి కామారెడ్డి రైల్వే పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.
అకోలా రైలు కామారెడ్డికి రాగానే సదరు చిన్నారి రైలులోని మెట్లకు దగ్గరగా కూర్చుని ఏడుస్తుందని కొందరు చెప్పగా, ఓ వృద్ధురాలు రైలు దిగి పాపను ప్లాట్‌ఫాంపై వదిలి వెళ్లిందని మరి కొందరు చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటనే దానిపై స్పష్టత రాలేదు. రైల్వే స్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర మాత్రమే సీసీ కెమెరా ఉంది. ప్లాట్‌ఫాం పై జరిగే దృశ్యాలు అందులో కనబడవు.
దీంతో పాపను కన్న తల్లే వదిలించుకుందా, లేక మరెవరైనా కావాలనే వదిలి వెళ్లారా అనేది తెలియలేదు. మహారాష్ట్రకు చెందిన చిన్నారి మాదిరిగా అనిపించడం తప్ప ఎలాంటి వివరాలు లేవు.
కేసు నమోదు చేసి విచారణ
బాలల సంరక్షణ ఉల్లంఘన, ఐపీసీ సెక్షన్ 317 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రైల్వే స్టేషన్‌కు ఎవరైనా తీసుకువచ్చారా అనే కోణంలో మొదట విచారించారు. అందుకు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని మంగళవారం కామారెడ్డిలోని అన్ని కూడళ్లు, రైల్వే స్టేషన్ దారి గుండా ఉండే సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు.
దీంతో చిన్నారి రైలులోనే కామారెడ్డికి చేరినట్లు నిర్ధారణకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు అకోలా నుంచి కామారెడ్డి వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ ఫుటేజీలను పరిశీలించే పనిలో ఉన్నారు. ఇందు కోసం అకోలా, నాందేడ్, ముత్కేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లలో సీసీ ఫుటేజీల పరిశీలన, విచారణ జరపాల్సి ఉంది.
బుధవారం నుంచి ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఆయా స్టేషన్‌లలో విచారణ జరుపనున్నట్లు తెలిసింది. ఎలాగైనా కేసును చేధించి సదరు చిన్నారిని కన్నవారి చెంతకు చేర్చాలనీ, వాస్తవాలను వెలికి తీయాలని కామారెడ్డి రైల్వే పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment