అవస్థలు పడుతున్నాం
బ్రహ్మోత్సవాలు, పెరటాసి నెల శనివారాల్లో తిరుమలకు వచ్చి వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. రైళ్ల వసతి లేకపోవడం ప్రధాన కారణం. ప్రతిసారీ తమిళనాడు నుంచే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
- మురుగేష్, ధర్మపురి,తమిళనాడు
చార్జీలు భరించలేకున్నాం...
బస్సు చార్జీలతో పోల్చుకుంటే రైలుచార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. విజయవాడ, వాణిజ్య రాజధాని విశాఖపట్నం నుంచి ఆశించిన స్థాయిలో బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించలేదు. దీంతో బస్‌చార్జీలను భరించలేక, స్వామివారి మొక్కు చెల్లిం చుకోవాలనే తపనతో అవస్థల ప్రయాణం చేస్తున్నాం.
-మనోహర్, విజయవాడ
తిరుపతి అర్బన్: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 13 జిల్లాల భక్తుల కోసమైనా ఏర్పాటు చేస్తారేమోనని ఆశించినా భంగపాటే ఎదురైంది. అత్యధిక భక్తుల తాకిడి ఉండే తమిళనాడు యాత్రికుల కోసమైనా ప్రత్యేక రైళ్లు , అదనపు బోగీల ఏర్పాటు జరుగుతుందని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం చెన్నై, కొయంబత్తూరు, వేలూరు నగరాలకు నడుస్తున్న ఒకట్రెండు రైళ్లు మినహా ఎక్కువ సంఖ్యలో రైళ్లు లేవు. బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక రైళ్లు నడపాలనే డిమాండ్ ఉన్నా ఉన్నతాధికారులు స్పందించలేదు.
బస్ చార్జీలు రెండింతలు..
బ్రహ్మోత్సవాలకు తమిళనాడు, కర్ణాటక భక్తులు బస్సుల ద్వారా చేరుకోవాలంటే బస్సులకు ఎక్కువ మొత్తం చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈరెండు రాష్ట్రాల నుంచి ఏటా రద్దీ ఉంటుంది. వారంతా బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఆదాయం సమకూర్చడంలో సికింద్రాబాద్ తరువాత తిరుపతిదే పైచేయి. ఏడాదికి సుమారు రూ.22కోట్లకు పైగా ఆదాయం తిరుపతి నుంచే వస్తున్నా ప్రాధాన్యత చూపడం లేదు. రైల్వేబోర్డు అధికారుల నుంచి జోనల్ అధికారుల వరకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
65 రైళ్లు.. 80 వేల మంది యాత్రికులు
తిరుపతి నుంచి, తిరుపతి మీదుగా రోజూ 60 నుంచి 65 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్ల ద్వారా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 60 వేల మంది ప్రయాణిస్తారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాల్లో ఈసంఖ్య 80 వేలకు పైగా ఉంటుంది. అందులోనూ బ్రహ్మోత్సవాల్లో రోజుకు లక్ష దాటొచ్చని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. భక్తుల్లో సరిహద్దురాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ర్ట, ఒడిస్సాకు చెందిన వారే ఎక్కువ గా ఉంటారు.
హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో తిరుపతికి రైళ్లు లేవు. చెన్నై-తిరుపతి మధ్య సప్తగిరి, గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లు మూడు ట్రిప్పులు, 2 ప్యాసింజర్ రైళ్లు రెండు ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి శేషాద్రి, హౌరా, ఇంటర్ సిటీ(వారంలో రెండు రోజులు మాత్రం) ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మైసూర్ ప్యాసింజర్ మాత్రమే నడుస్తోంది. ముంబై నుంచి కూడా రోజుకు 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే వస్తున్నాయి.
అలాంటి ప్రతిపాదన లేదు
బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా లేవు. ఈసారి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సూచన మేరకు అవసరమైన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తాం. ఒక రైలుకు సరిపోయేంత రద్దీ ఎదురైతే ప్రత్యేక రైలును నడిపేందుకు ఉన్నతాధికారుల ఉత్తర్వులతో చర్యలు తీసుకుంటాం.
-కుప్పాల సత్యనారాయణ, సీనియర్ లైజన్ ఆఫీసర్, దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి.
బ్రహ్మోత్సవ బండి.. రాలేదండి
Published Sat, Oct 1 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement