ఐదు నెలలు.. అ‘డ్రెస్‌‘ లేదు..! | no uniform dress to students in government schools | Sakshi
Sakshi News home page

ఐదు నెలలు.. అడ్రెస్‌ లేదు..!

Published Wed, Nov 2 2016 3:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ఐదు నెలలు.. అ‘డ్రెస్‌‘ లేదు..!

ఐదు నెలలు.. అ‘డ్రెస్‌‘ లేదు..!

పాత దుస్తులతోనే పాఠశాలకు.. 
సగం విద్యాసంవత్సరం గడిచినా దుస్తులు కరువు 
వస్త్రం కొనుగోలు ధర నిర్ణయించని ప్రభుత్వం 
పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు 
 
 
వైరా : పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు దుస్తులు అందిస్తాం.. ఇది పాత మాట.. ప్రస్తుతం ఐదు నెలలు గడుస్తోంది.. సగం విద్యాసంవత్సరం గడిచిపోయింది.. దుస్తుల పంపిణీ ఏమోగానీ.. అవసరమైన వస్త్రం ఎంపిక కనీసం చేపట్టలేదు.. పాతవి.. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.. పాఠశాలల తనిఖీలకు వచ్చిన రాష్ట్రస్థాయి అధికారులు ఉపాధ్యాయుల పనితీరు, సమస్యలను పరిశీలించారే తప్ప విద్యార్థుల దుస్తుల గురించి పట్టించుకోనట్లు తెలుస్తోంది.  
 
 
విద్యార్థుల మధ్య అసమానతలు తొలగిస్తూ.. అంతా సమానమనే భావన కల్పించేందుకు ప్రభుత్వం డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో 1,591 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 2,13,093 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 49,336, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 28,983, ఉన్నత పాఠశాలల్లో 1,34,774 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుల మతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే బాలబాలికలకు ఒకే రకం దుస్తులు ఉండా లన్న నిబంధన ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వమే దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొదట కుట్టించిన దుస్తులను పంపి ణీ చేసేవారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్తులు చిన్నవి, పెద్దవి కావడంతో ప్రభుత్వం ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేసి.. ఎస్‌ఎంసీ ద్వారా కుట్టించి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసేవారు. జతకు రూ.40 చొప్పున కుట్టుకూలీ ఇచ్చేవారు లేకపోవడంతో ఈ బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించారు. ఒక వేళ వస్త్రం కొనుగోలు చేసినా పాఠశాలలకు చేర్చి.. విద్యార్థులకు పంపిణీ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం ముగిసిపోయింది.  
 
అందరికీ ఒకే కొలత... 
విద్యార్థులకు దుస్తులు అందజేయటం వరకు బాగానే ఉన్నా.. అందరికీ ఒకే విధంగా కుట్టించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఒక్క జత వస్త్రానికి రూ.160, కుట్టేందుకు రూ.40 వెచ్చించారు. దర్జీ అందరికీ ఒకే కొలత ప్రకారం కుట్టి పాఠశాలలకు పంపిణీ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు పొడవుగా ఉండటం, మరి కొందరు లావుగా ఉండటంతో ఆ దుస్తులు వేసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 
 
ఈసారి అనుమానమే...  
ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా దుస్తుల పంపిణీ జాడేలేదు. ఇప్పటివరకు వస్త్రం కొనుగోలు చేయకపోవడంతో దుస్తులను పంపిణీ  చేస్తారనే నమ్మకం కూడా లేదు. వేసవి సెలవుల్లోనే వస్త్రం ఎంపిక చేయడం.. కుట్టడం ప్రక్రియ చేపడితే పాఠశాలలు తెరిచేలోగా పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు వస్త్రానికి సంబంధించిన ధరను ప్రభుత్వ ఖరారు చేయకపోవడంతో కొనుగోలు చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement