సాక్షి, ముంబై: ఈ ఏడాది ముంబైకర్లకు నీటి తిప్పలు ఉండకపోవచ్చు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో నగరానికి నీటిని సరఫరా చేసే అన్ని జలాశయాలు నిండాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. గతేడాది వర్షాలు లేక రిజర్వాయర్లలో నీరు చేరకపోవడంతో తరచూ నీటికోతలు విధించామని, అయితే ఈసారి ఆ తిప్పలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. ‘నగరానికి మంచినీటిని సరఫరా చేసే అన్ని జలాశయ పరీవాహక ప్రాంతాల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండాయి. దీంతో ఈసారి ముంబైకర్లకు నీటి కోత విధించే అవకాశాలు లేవ’ని వారు చెప్పారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం మోదక్‌సాగర్ మినహా అన్ని జలాశయాలు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. మధ్య వైతర్ణ జలాశయం మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఈ డ్యాం నుంచి నీటి సరఫరా జరుగుతుందన్నారు.
దీంతో కార్పొరేషన్‌కు చెందిన నీటి నిలువల సామర్థ్యం కూడా పెరిగిందని అధికారి తెలిపారు. ఈ నెలాఖరు వరకు కార్పొరేషన్‌కు చెందిన హైడ్రాలిక్ విభాగం అధికారులు నీటి వనరులు అందే ప్రాంతాల నుంచి నీటిని నిల్వ చేయనున్నారని వివరించారు. ‘సెప్టెంబర్ 23 వరకు ఎన్నడూ లేని విధంగా అన్ని జలాశయాలలో 13.41 లక్షల మిలియన్ లీటర్ల వరకు నీటి నిల్వలు చేరుకున్నాయి. గత మూడేళ్లుగా నీటి నిలువలు 12.60 లక్షల మిలియన్ లీటర్ల వరకు మించేవి కావ’ని అధికారులు తెలిపారు. వర్షాకాలం మినహా మిగతా రోజుల్లో నగరానికి 13 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుందని నీటి విభాగ అధికారులు తెలిపారు. ఈ రోజు వరకు అత్యధిక నీటి నిలువలు ఉన్నాయని హైడ్రాలిక్ ఇంజినీర్ రమేష్ బంబలే తెలిపారు.
ఇదిలా వుండగా నగరానికి రోజుకు 4,200 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుంది. ప్రస్తుతం కార్పొరేషన్ 3,400 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. ఇదిలా ఉండగా 2012లో 12.59 మిలియన్ లీటర్లు, 2011లో 12.44 మిలియన్ లీటర్లు, 2010లో 12.35 మిలియన్ లీటర్ల నీటి నిలువలు నమోదయ్యాయి.