- నామినేషన్లకు ముందు నుంచే ఊపందుకుంటున్న ప్రచారం
- దూసుకెళ్తున్న బీజేపీ
- మీనమేషాలు లెక్కిస్తున్న జేడీఎస్
- 19 నుంచి నామినేషన్ల పర్వం
- జేడీఎస్‌లోకి షరీఫ్?
- దేవెగౌడతో భేటీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి ఇంకా తెర లేవక ముందే అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఎటువంటి అట్టహాసం లేకుండా కొందరు నాయకులు, కార్యకర్తలు వెంట రాగా ఓట్లను అభ్యర్థించడం ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీలు ఇదివరకే మూడు, నాలుగు మినహా మిగిలిన నియోజక వర్గాలకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు ఒకే దశలో వచ్చే నెల 17న పోలింగ్ జరుగనుంది.
ఈ నెల 19 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ 29తో ముగుస్తుంది. అనంతరం కేవలం 17 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంటుంది. అయితే ఇప్పటికే పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు కావడం, లోక్‌సభ ఎన్నికలు కనుక తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జేడీఎస్ అభ్యర్థులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు చివరి నిమిషంలో మారే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల అభ్యర్థిత్వం వంద శాతం ఖరారయ్యాకే ప్రచారం చేపట్టాలని ఆ పార్టీ తొలి జాబితాలోని అభ్యర్థులు భావిస్తున్నట్లు సమాచారం. కాగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఇప్పటికే మైసూరులో పాదయాత్ర ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు.
బీజేపీ బెంగళూరు ఉత్తర నియోజక వర్గం అభ్యర్థి డీవీ. సదానంద గౌడ బ్యాటరాయనపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో పలు చోట్ల కార్యకర్తలు, స్థానిక ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆయన వెంట పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు మునిరాజు, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు ప్రభృతులున్నారు. బెంగళూరు సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఆయనకు ప్రచారంలో చేదోడు వాదోడుగా నిలిచారు.
దేవెగౌడను కలసిన షరీఫ్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ శనివారం నగరంలో జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ. దేవెగౌడను కలుసుకున్నారు. బెంగళూరు సెంట్రల్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైంది. దీంతో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా గౌడను కలుసుకున్నారు. వర్తమాన దేశ రాజకీయాల గురించి తామిద్దరం చర్చించుకున్నామని సమావేశం అనంతరం జాఫర్ షరీఫ్ తెలిపారు. ఒక వేళ ఆయన జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే... కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలి బీజేపీ అభ్యర్థి పీసీ. మోహన్ పని సులభమవుతుందని భావిస్తున్నారు.