వణుకు పుట్టాలి
భూ ఆక్రమణదారులపై నాన్‌బెయిలబుల్ కేసులు
నేరం రుజువైతే కఠిన శిక్షలు
కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక
న్యాయస్థానాన్ని ప్రారంభించిన సీఎం
న్యాయస్థానాన్ని ప్రారంభిస్తున్న సీఎం తదితరులు
బెంగళూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. నగరంలోని రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై నాన్‌బెయిలబుల్ కేసులను నమోదు చేయాలి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించాలి. భూముల ఆక్రమణల్లో ఆక్రమణదారులకు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. వారికి కూడా శిక్షలు పడితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి’ అని పేర్కొన్నారు. సభా సమితి నివేదిక ప్రకారం ఒక్క బెంగళూరు నగరంలోనే 34వేల భూముల ఆక్రమణల కేసులు నమోదు కాగా, కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అన్నారు. ఇటీవలి కాలంలో రోజు రోజుకు భూముల ధరలు పెరిగిపోతుండడంతో భూములను కబ్జా చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ‘భూ ఆక్రమణ దారులు తమ వద్ద ఉన్న డబ్బుతో ఏమైనా చేయవచ్చని భావిస్తుంటారు. ఏ వ్యవస్థనైనా తమ దగ్గర ఉన్న డబ్బుతో కొనేయవచ్చని, న్యాయమూర్తులను కూడా తమ డబ్బుతో కొనేయవచ్చని అనుకుంటూ ఉంటారు.
అందుకే అలాంటి వారికి కనీసం జామీను కూడా లభించకుండా నాన్ బెయిలబుల్ కేసులను పెట్టాలి. ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినపుడు కొంతమంది ఇందుకు అడ్డుపడేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఇప్పుడిక వణుకు ప్రారంభమైంది’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు ప్రత్యేక కోర్టులో త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఓ సమితిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆక్రమణదారులను శిక్షించడంతో పాటు నిరపరాధులను రక్షించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. భూ ఆక్రమణలు పెద్ద మాఫియాలా రూపాంతరం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోని కొన్ని లోపాలను ఇలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోగలిగామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.