= వారికి సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదు
= చంద్రబాబుతో లగడపాటి, జేసీ కుమ్మక్కు
= వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజం
మడకశిర, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర విషయంలో కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మడకశిరలోని మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల్లో హీరోలు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇచ్చారని, అయితే వారికి సమైక్యాంధ్రపై ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉండివుంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించి, ఎందుకు ఆమోదింప జేసుకోలేదని ప్రశ్నించారు.
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్, జేసీ దివాకర్‌రెడ్డి కుమ్మక్కై జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ల కోసమే వారు చంద్రబాబుతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ సీమాంధ్ర ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా సమైక్యాంధ్రపై నాటకాలు ఆడుతున్నట్లు దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో పాటుపడుతున్నట్లు చెప్పారు. జగన్ ప్రయత్నాన్ని సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు హర్షించకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్న విషయం తెలిసికూడా ముఖ్యమంత్రి, సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు పట్టించుకోలేదని విమర్శించారు.
16న మడకశిరలో సమైక్య శంఖారావం సభ
మడకశిరలోని వైఎస్సార్‌సర్కిల్‌లో ఈ నెల 16న ఉదయం పది గంటలకు సమైక్యశంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికారప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ముఖ్య నేతలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం నోటీస్ ఓ డ్రామా
Published Thu, Dec 12 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement