
మీడియాతో మట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ
మడకశిర: అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే రైతులను పావులుగా వాడుకుంటూ నీచ రాజకీయం చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా మడకశిరలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెచ్చగొట్టేందుకు చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కూడా తోడయ్యారని దుయ్యబట్టారు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు సామాజికవర్గం వారు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారం బయటికి రాకుండా చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం వైఎస్ జగన్ పాలనా వికేంద్రీకరణ ప్రతిపాదన చేశారని, ప్రస్తుతం రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నివేదిక రాకుండానే చంద్రబాబు రాజధానిపై రాద్ధాంతం చేయడం తగదని శంకరనారాయణ హితవుపలికారు.