చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అమ్మ మెడికల్స్‌ను ముఖ్యమంత్రి జయలలిత గురువారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రభుత్వం అమ్మ పేరుతో అనేక సేవలను పరిచయం చేసింది. అమ్మ క్యాంటిన్, అమ్మ కూరగాయల మార్కెట్, అమ్మ మినరల్ వాటర్ ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. వీటిల్లో అమ్మ క్యాంటీన్ ప్రజలకు మరింత చేరువైంది. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేసిన 200 క్యాంటీన్లు ఏడాదిగా సేవలు అందిస్తున్నాయి. మరో 200 క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తున్నట్లు మేయర్ సైదై దొరస్వామి ఇటీవల ప్రకటించారు.
తాజాగా అమ్మ మెడికల్స్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకు అన్ని రకాల ఔషధా(మందు)లు ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పా టు చేస్తున్నారు. 210 సహకార దుకాణాల ద్వారా ఇప్పటికే చౌకధరకు మందులను అందుబాటులోకి తెచ్చారు. వీటికి అదనంగా అమ్మ పేరున మరో 100 షాపులు ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 13న అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా తొలిదశలో ఏడు జిల్లాల్లో పది అమ్మ మందుల షాపులను ఈనెల 26న సీఎం జయలలిత ప్రారంభించనున్నారు. 10శాతం తక్కువ ధరకు అన్ని రకాల మందులు గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
శ్రీరంగంలో యాత్రి నివాస్: ప్రసిద్ధ పుణ్యక్షే త్రమైన శ్రీరంగంలోని శ్రీరంగనాధర్ ఆలయానికి అనుబంధంగా రూ.43 కోట్లతో నిర్మించిన యాత్రి నివాస్‌ను సీఎం జయలలిత ఈనెల 30న ప్రారంభించనున్నారు. దేశంలో 108 ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో శ్రీరంగనాథర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. వారి సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యాత్రి నివాస్‌ను శ్రీరంగం పంజకరైలో 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఒకేసారి 150 మంది బస చేయగల నాలుగు డార్మిటరీలు కలిగిన ఆరు భవనాలు, వంద డబుల్ బెడ్‌రూములు, ఒక్కో బ్లాకులో నాలుగు కాటేజీలు లెక్కన ఆరు బ్లాకుల్లో ఫ్యామిలీ కాటేజీలు నిర్మించారు.
ఒక్కో బ్లాకులో 12 మంది సభ్యులు కలిగిన రెండు కుటుంబాలు బస చేసేలా సౌకర్యాలు కల్పించారు. భక్తుల వెంట వచ్చే పనివారికి, డ్రైవర్లకు ప్రత్యేకంగా డార్మిటరీ నిర్మించారు. మొత్తంమీద ఈ యాత్రి నివాస్‌లో ఒకేసారి వెయ్యిమంది భక్తులు బస చేసే వీలుంది. సీఎం జయలలిత ఈనెల 30న ఈ యాత్రినివాస్‌ను భక్తులకు అంకితం చేయనున్నారు.మసీదులకు బియ్యం: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని మసీదులకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీకి నిర్ణయించింది. రంజాన్ దీక్షలు మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్నాయి. ప్రతి ఏటా ఇఫ్తార్ సమయంలో గంజి తయారీ నిమిత్తం ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గాను 4,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించేందుకు సీఎం జయలలిత బుధవారం ఆదేశాలిచ్చారు. ఈ బియ్యాన్ని రాష్ట్రంలోని మూడు వేలకు పైగా మసీదులకు అందజేయనున్నారు.
అమ్మ మెడికల్స్ నేడు ప్రారంభం
Published Wed, Jun 25 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM
Advertisement
Advertisement