నాకు 5 రోజులు సమయం ఇవ్వండి: సెల్వం
చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధీమాగా ఉన్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారని, ఆ జాబితాను చూపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారని, ఎమ్మెల్యేలను బలవంతంగా క్యాంపునకు తరలించారని, తనకు 5 రోజులు సమయం ఇస్తే ఎమ్మెల్యేల మద్దతును కూడగడతానని పన్నీరు సెల్వం తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును కోరినట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం గవర్నర్ను పన్నీరు సెల్వం కలిసిన సంగతి తెలిసిందే.
గవర్నర్‌తో సెల్వం దాదాపు 15 నిమిషాలు సమావేశమయ్యారు. శశికళ వర్గం ఎమ్మెల్యేలను బందీలుగా చేసిందని గవర్నర్కు సెల్వం ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనకు 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలియజేస్తూ, వారి సంతకాలతో కూడిన జాబితాను శశికళ గవర్నర్కు పంపిన సంగతి తెలిసిందే. సెల్వం ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎమ్మెల్యేల విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తనను కలిసిన శశికళతో కూడా ఈ విషయంపై మాట్లాడినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే.. సెల్వం అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కొంత సమయం కావాలని గవర్నర్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చాలామంది ఎమ్మెల్యేల సంతకాలను శశికళ ఫోర్జరీ చేశారని, పన్నీరు సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన మద్దతుదారుడు, అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ చెప్పారు. శశికళ వర్గం పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచిందని ఆరోపించారు. తమదే నిజమైన అన్నాడీఎంకే అని చెప్పారు. శశికళ శిబిరం నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 235 ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 118 సభ్యులు ఉండాలి. అన్నాడీఎంకే ప్రస్తుతం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో శశికళ, పన్నీరు సెల్వం వెంట ఎంతమంది ఉన్నారన్నది తేలాల్సివుంది. ఇక సెల్వానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.