ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం! | o panneerselvam hopes alive | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం!

Published Wed, Apr 5 2017 11:29 AM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం! - Sakshi

ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం!

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు త్వరలో తన శిబిరంలోకి వచ్చి తీరుతారన్న ఆశల పల్లకిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఉన్నారు. శశికళ కుటుంబ జోక్యం కారణంగానే అన్నాడీఎంకేలో చీలిక అనివార్యం అయిందని సమర్థించుకున్నారు. అమ్మ మరణంలో మిస్టరీపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడే ఉన్నట్టు చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టించి బయటకు వచ్చిన నేత పన్నీరుసెల్వం. అధి కారం దూరమైనా, పార్టీని పూర్తిగా  తన గుప్పెట్లోకి తీసుకోవడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపుతో పార్టీవర్గాల దృష్టిని తన వైపు తిప్పుకుని బలాన్ని చాటుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారబిజీలో ఉన్న మాజీ సీఎం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ శిబిరం నేత ఓ.పన్నీరుసెల్వం మీడియాకు ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ మేరకు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఆశాభావాల్ని, ధీమా వ్యక్తం చేస్తూ, తాను గతంలో చేసిన వాఖ్యలకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు.

122 మంది వస్తారు
అసెంబ్లీ వేదికగా బలపరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, బలవంతంగా బంధించి మద్దతు కూడగట్టుకున్నారని ఆరోపించారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఏ మేరకు  వ్యతిరేకిస్తున్నారో అన్న విషయం ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల ఫలితాల నాటికి తేలుతుందన్నారు. ఎన్నికల అనంతరం ఆ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదికగా అన్నాడీఎంకే మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తాత్కాలికమేనని జోస్యం చెప్పారు.

ఆ కుటుంబ జోక్యంతో చీలిక
దివంగత సీఎం ఎంజీఆర్‌ ఎన్నడూ పార్టీలో తన కుటుంబీకుల జోక్యానికి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. అమ్మ జయలలిత కూడా అదే తరహాలో ముందుకు సాగారని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు అమ్మ వ్యతిరేకం అని, అమ్మ మరణంతో శశికళ కుటుంబం జోక్యం పెరగడంతోనే చీలిక అనివార్యం అయిందని చెప్పారు. ఆ కుటుంబ జోక్యాన్ని ఎన్నడూ అమ్మ అనుమతించలేదని, అమ్మ లేని దృష్ట్యా, ఇష్టారాజ్యంగా ఆ కుటుంబం వ్యవహరిస్తూ పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ఆ కుటుంబ జోక్యం లేకుండా ఉండి ఉంటే, అందరం ఒకే వేదికగా కలిసి ఉండే వాళ్లమని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని సాగనంపి, మళ్లీ అందరూ ఒకే వేదికగా ముందుకు సాగే సమయం తప్పకుండా వస్తుందన్న నమ్మకం తనలో ఉందన్నారు. ఇందుకు ప్రజలు అండగా నిలబడాలని, ప్రజా మద్దతుతో అన్నాడీఎంకే వైభవాన్ని చాటుతామని, కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని మళ్లీ సాధిస్తామని  ఆశాభావం వ్యక్తం చేశారు.

కట్టుబడే ఉన్నా
అమ్మ మరణంలో అనుమానాలు తేలాలంటే విచారణ కమిషన్‌ను నియమించాల్సిందేనని పన్నీరుసెల్వం డిమాండ్‌ చేశారు. తాను ఇందుకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. అమ్మను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అధికారులు కొందరు ఆమెతో భేటీ అయ్యారని వివరించారు. కావేరి జలాల సమస్యపై సాగిన ఈ భేటికి తాను వెళ్లలేదని చెప్పారు. ఆ సమావేశానికి వెళ్లిన అధికారులతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. అమ్మ స్వయంగా కావేరి నివేదిక విషయంగా పలు మార్పులు చేర్పులు, సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే, ఆ మరుసటి రోజే అమ్మ అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రకటించడంతోనే అనుమానాలు కలిగాయని చెప్పారు. అందుకే అనుమానాల నివృత్తి లక్ష్యంగా విచారణ కమిషన్‌కు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement